వ్యక్తుల అరెస్ట్, నిర్బంధం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) పరిధిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యంత కీలకమైన నిబంధనలను నిర్దేశించింది. ఏ వ్యక్తినైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు విధించే 24 గంటల కాలపరిమితి నియమంపై కోర్టు కీలక స్పష్టతనిచ్చింది. పోలీసులు రికార్డుల్లో అధికారికంగా అరెస్టు చూపిన సమయం నుండి కాకుండా, సదరు వ్యక్తిని వాస్తవంగా ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారో ఆ సమయం నుంచే ఈ 24 గంటల వ్యవధి ప్రారంభమవుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం, పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని 24 గంటల లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ఒకవేళ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచినట్లయితే, ఆ వ్యక్తిని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసుల అధికారిక అరెస్టు రికార్డుల కంటే, నిందితుడిని భౌతికంగా అదుపులోకి తీసుకున్న సమయానికే ప్రాధాన్యత ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
దీంతో పాటు, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 58 ప్రకారమే పోలీసుల నిర్బంధం కొనసాగాలని, అది పూర్తిగా సహేతుకంగా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని, ప్రతి ఒక్క అరెస్టులోనూ చట్టబద్ధమైన ప్రక్రియను పక్కాగా అనుసరించాల్సిందేనని పోలీసు యంత్రాంగానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.






