కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పరాజయం పార్టీ నేతల మధ్య తీవ్ర ఆరోపణలకు దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి ఛైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు సొంత వార్డులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించగా, వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావుకు మాత్రం సొంత వార్డులోనే టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. ఈ విచిత్రమైన ఫలితాలు నియోజకవర్గ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి.
ఈ ఓటమిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు ఒక సంచలన వీడియోను విడుదల చేశారు. తన ఓటమికి వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్‌లే పూర్తి కారణమని ఆయన ఆ వీడియోలో నేరుగా ఆరోపించారు. ఈ ఇద్దరు నేతలు తన గెలుపు కోసం పనిచేయకుండా, అంతర్గతంగా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను నియోజకవర్గంలో ఎవరూ నమ్మవద్దని చింతపల్లి నాగేశ్వరరావు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పార్టీ టికెట్ ఖరారు చేసే సమయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, సూర్యప్రకాష్ ల ప్రతిపాదనతోనే అధిష్ఠానం నాగేశ్వరరావు పేరును ఖరారు చేసినప్పటికీ… ఎన్నికల సమయానికి సొంత పార్టీ నేతలే నమ్మకద్రోహానికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతుండటంతో, కోనసీమ జిల్లా వైసీపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.














