సాయిరెడ్డిని తిట్టలేకపోతున్న వైసీపీ, కారణం అదేనా..?

0
2

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఏ నేతకైనా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం నుండి తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదురుకావడం సర్వసాధారణం. గతంలో పార్టీ వీడిన సొంత కుటుంబ సభ్యులైన వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలను సైతం వైసీపీ సోషల్ మీడియా వదిలిపెట్టలేదు. కానీ, ఒకప్పుడు వైసీపీలో నెంబర్ టూ స్థానంలో ఉండి, ప్రస్తుతం సొంతంగా కొత్త పార్టీ పెట్టబోతున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం సీన్ పూర్తిగా భిన్నంగా ఉంది. సాయిరెడ్డి వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ వైసీపీని తిడుతున్నా.. ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యం ఆయనపై ఎదురుదాడి చేయలేకపోవడానికి ఆయన అనుసరిస్తున్న అత్యంత వ్యూహాత్మక సాఫ్ట్ అప్రోచే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయసాయిరెడ్డి తన తాజా ప్రకటనల్లో జగన్‌ మోహన్ రెడ్డిని నేరుగా ఎక్కడా దూషించడం లేదు. తాను జగన్‌ను వదిలి వెళ్లాలని కలలో కూడా అనుకోలేదని, కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఉచ్చులో జగన్ చిక్కుకుపోయారని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ చెప్పుడు మాటలు విని తనను బాధపెట్టారని, ఆ కోటరీ సృష్టించిన 70కి పైగా అవమానాలను భరించి భరించి చివరకు బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ తప్పు జగన్‌ది కాదు, ఆయన చుట్టూ ఉండి తప్పుడు సలహాలు ఇస్తున్న కోటరీదే అనే కలరింగ్ ఇవ్వడం ద్వారా వైసీపీ శ్రేణుల్లో ఉన్న జగన్ అభిమానులను సాయిరెడ్డి లైన్ లోకి తెచ్చుకుంటున్నారు.

తాను ఇంకా జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నట్లు చూపించుకుంటూ, పార్టీ కేడర్ తనను శత్రువుగా చూడకుండా జాగ్రత్త పడుతున్నారు. సాధారణంగా ఎవరైనా జగన్‌ను తిడితేనే వైసీపీ సోషల్ మీడియా దారుణంగా కౌంటర్లు ఇస్తుంది. కానీ ఇక్కడ సాయిరెడ్డి స్వయంగా “వైఎస్సార్, రాజారెడ్డి నన్ను పల్లెత్తు మాట అనలేదు.. జగన్‌ను వీడతానని అనుకోలేదు” అంటూ పాత జ్ఞాపకాలను, వైఎస్ కుటుంబంపై తనకున్న భక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆయనను ఒక ద్రోహిగా ముద్ర వేయడానికి వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఎలాంటి బలమైన ఆయుధం దొరకడం లేదు.

పైగా పార్టీలో నిజంగానే కోటరీ వల్ల పాత నేతలకు అవమానాలు జరిగాయనే భావన క్షేత్రస్థాయి క్యాడర్‌లో కూడా ఉంది. అందువల్ల సాయిరెడ్డిని టార్గెట్ చేస్తే, ఆ కోటరీని సమర్థించినట్లు అవుతుందనే భయంతోనే వైసీపీ సోషల్ మీడియా సైన్యం సైలెంట్ అయిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నవంబర్ 11న ఉదయం 11 గంటలకు విజయవాడలో తన కొత్త పార్టీ పేరు, జెండాను ప్రకటించబోతున్నట్లు సాయిరెడ్డి అధికారికంగా స్పష్టం చేశారు. ఈ పార్టీ ఏ ఒక్కరికో, లేదా రెండు కులాలు, రెండు కుటుంబాలకో పరిమితం కాదని.. అన్ని సామాజిక వర్గాలకు, మతాలకు రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలు కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.