23 C
Vijayawada
Saturday, November 21, 2026
Home ఆంధ్రప్రదేశ్ భార్య.. భర్త ఒడిలో కూర్చుంటే తప్పా? బిజెపి నేతలకు ఎందుకంత ఉలికిపాటు? శివపార్వతుల ఫోటోతో రాహుల్...

భార్య.. భర్త ఒడిలో కూర్చుంటే తప్పా? బిజెపి నేతలకు ఎందుకంత ఉలికిపాటు? శివపార్వతుల ఫోటోతో రాహుల్ కౌంటర్.!

0
11

సోనియా గాంధీ రచించిన ‘Belonging: A Journey of Love’ పుస్తక పరిచయ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చెప్పిన ఒక చిన్ననాటి జ్ఞాపకాన్ని బిజెపి వాళ్లు వివాదంగా మార్చారు. తన తల్లిదండ్రులు సోనియా, రాజీవ్ గాంధీల దాంపత్య అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. భోజనం చేసే సమయంలో ఒక్కోసారి తన తల్లి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఒడిలో కూర్చునేవారని రాహుల్ చెప్పారు. చిన్నతనంలో తనకు ఇదొక సాధారణమైన విషయంగానే అనిపించేదని, కానీ స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులు అలా ఉండకపోవడం చూసి ఆశ్చర్యపోయేవాడినని గుర్తుచేసుకున్నారు.

ఒక కుటుంబానికి సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకం. తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని గుర్తు చేసుకున్న సందర్భం. కానీ ఈ మాటను కూడా కొందరు రాజకీయ వివాదంగా మార్చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. అసలు భార్య తన భర్త ఒడిలో కూర్చుంటే తప్పేమిటి? భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలున్నప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకుంటారు. కలిపినోట్లో ముద్దలు కూడా పెడతారు. దాన్ని వెక్కిరించాల్సిన అవసరం ఏముంది? వెక్కిరించే వాళ్లు పురుషాహంకారులు, పితృస్వామ్య భావజాలికులు.

ఇంకొంతమంది ఇది భారతీయ సంస్కృతి కాదు, సంప్రదాయం కాదని మెటికలు విరుస్తున్నారు. అంటే హిందూ సంప్రదాయంలో దాంపత్యప్రేమకు స్థానం లేదని చెప్తున్నారా?భార్య భర్త ఒళ్లో కూర్చోకూడదని ఏ గ్రంథంలో రాసుందో వీళ్లు చెప్పగలరా? దాంపత్య ప్రేమ, అన్యోన్యత, ఒకరికొకరు తోడుగా నిలబడటం మన సంప్రదాయంలో భాగమే. హిందూ దేవతామూర్తుల రూపాల్లోనూ ఈ భావన స్పష్టంగా కనిపిస్తుంది. పరమ శివుడి తొడపై పార్వతీదేవి కూర్చున్న ఉమామహేశ్వర రూపాన్ని మనం ఎన్నో ఆలయాల్లో చూస్తుంటాం. ఆ రూపాన్ని భక్తితో పూజిస్తాం. శివపార్వతుల అనుబంధాన్ని ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా భావిస్తాం. అలాగే లక్ష్మీనరసింహస్వామి రూపంలో స్వామివారి తొడపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది.

ఈ రూపాల్లో ఆధ్యాత్మిక, తాత్విక భావనలు కూడా ఉన్నాయి. మరి మన సంప్రదాయంలోనే ఇలాంటి దివ్యరూపాలను పవిత్రంగా భావిస్తున్నప్పుడు, ఒక భార్య తన భర్త ఒడిలో కూర్చుంటే మాత్రం తప్పెలా అవుతుంది? శివుడి తొడపై పార్వతిని చూసి భక్తితో పూజించే మనం.. ఒక భర్త ఒడిలో భార్య కూర్చుంటే ఎందుకు వెక్కిరించాలి? పైగా వాళ్లింట్లో భోజనాల దగ్గర కూర్చున్నారు కానీ బజార్లో బహిరంగంగా ఒకరి ఒళ్లో ఒకరు కూర్చోలేదు. లేదా వేరే మహిళని ఒళ్లో కూర్చోబెట్టుకోలేదు.

రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలది ప్రేమ వివాహం. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా గాంధీ జీవితంలో వచ్చిన మార్పు గురించి కూడా రాహుల్ అదే సభలో భావోద్వేగంగా మాట్లాడారు. తన తండ్రి మరణం తర్వాత తాను చూసిన తల్లి వేరు, అంతకుముందు తనకు తెలిసిన తల్లి వేరు అని గుర్తుచేసుకున్నారు.అంటే రాహుల్ మాటల్లో ఒక కొడుకు తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమను, అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇందులో రాజకీయంగా విమర్శించాల్సిన అంశం ఏమీ లేదు. రాజీవ్ గాంధీని రాజకీయంగా వ్యతిరేకించవచ్చు. సోనియా గాంధీ నిర్ణయాలను విమర్శించవచ్చు. రాహుల్ గాంధీ రాజకీయాలపై అభిప్రాయాలు చెప్పవచ్చు.

రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడంలో, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడంలో బీజేపీ నేతలు, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా వర్గాలు గతంలో అనేకసార్లు విమర్శలు ఎదుర్కొన్నాయి. జవహర్లాల్ నెహ్రూ దగ్గర్నుంచి, ఆయన మునిమనవడు రాహుల్ గాంధీ వరకు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. నెహ్రూ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత హేళనలు కూడా కనిపించాయి. సోనియా గాంధీ విదేశీ మూలాలు, రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం, ప్రియాంక గాంధీ కుటుంబం వంటి అంశాలను కూడా రాజకీయ ప్రచారంలోకి లాగిన సందర్భాలు ఉన్నాయి. ఇది మంచి ధోరణి కాదు.

రాహుల్ గాంధీని ‘పప్పు’గా చిత్రీకరిస్తూ ఏళ్ల తరబడి సోషల్ మీడియాలో మీమ్స్, కార్టూన్లు, వ్యంగ్య పోస్టులు ప్రచారం చేశారు. ఆయన రాజకీయ ప్రసంగాలు, విదేశీ పర్యటనలు, వ్యక్తిగత వ్యవహారాలపై నిరంతరం ట్రోలింగ్ సాగింది. ఇప్పుడు పప్పు అనిపించుకున్నవాళ్లే భవిష్యత్తులో నిప్పులుగా మారతారు. ఇక్కడ రాహుల్ గాంధీ చిన్నప్పటి జ్నాపకం గురించి నిజాయతిగా చెప్పినప్పుడు దాన్ని కూడా తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ప్రత్యర్థుల కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను బహిరంగంగా ఎగతాళి చేసినప్పుడు కనిపించని సంస్కారం.. రాహుల్ తన తల్లిదండ్రుల ప్రేమానుబంధం గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకొచ్చింది? అయినా ఇదేమీ కుసంస్కారం, చెయ్యకూడని పనో కాదే.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దగ్గర్నుంచి ఏపీ బిజెపి నేత సాదినేని యామిని వరకు దీని మీద స్పందించని వాళ్లు లేరు.

రాజీవ్ ఒడిలో సోనియా కూర్చున్న ఫోటో పెట్టి తినేటప్పుడు ఒళ్లో, మరి పళ్లు తోముకున్నాక ఎక్కడ అని? ఇది రాహుల్ గాంధీ సిగ్గులేని తనమని, తల్లిని గౌరవించడం తెలియదని, అమాయకత్వంతో తన సిగ్గులేనితనాన్ని చూపించాడని రకరకాల విమర్శలు చేశారు. బిజెపి శ్రేణులు సోషల్మీడియాలో బాగా ట్రోల్ చేశారు. దానికి బదులుగా రాహుల్ గాంధీ శివుడి ఒడిలో పార్వతీదేవి కూర్చున్న ఫోటోని షేర్ చేశారు. తన తల్లిదండ్రుల అనుబంధాన్ని సమర్థిస్తూ, అందులో తప్పేం వుందంటూ కర్నాటకలోని హుయసలేశ్వర ఆలయంలో శివపార్వతుల శిల్పం ట్విటర్లో పోస్టు చచేశారు. బిజెపి ఆరెస్సెస్ మద్దతుదారుల మనసుల్లో భయం, కోపం, ద్వేషం వల్ల ప్రేమని వ్యక్తం చేయలేరని ఆ పోస్టులో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.