జ్వరం, దగ్గు లేదా గొంతు నొప్పి రాగానే త్వరగా తగ్గిపోవాలని చాలామంది సొంతంగా మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ 18 నుంచి 24 వరకు ‘ప్రపంచ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవం’ నిర్వహిస్తున్న నేపథ్యంలో, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడటం వల్ల పెరుగుతున్న ప్రమాదంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్లో డాక్టర్ చీటీ లేకుండానే యాంటీబయాటిక్స్ సులభంగా లభించడం, ప్రజలు సొంత వైద్యం చేసుకోవడం పెద్ద సమస్యగా మారిందని వైద్యులు పేర్కొంటున్నారు.
అవసరం లేకపోయినా పదేపదే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలోని సూక్ష్మజీవులు ఆ మందులను తట్టుకునే శక్తిని పెంచుకుంటాయి. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినప్పుడు లేదా పెద్ద సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు, అవయవ మార్పిడి వంటి సమయాల్లో సాధారణ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. అప్పుడు వైద్యులు మరింత శక్తివంతమైన మందులను వాడాల్సి వస్తుంది, తద్వారా దుష్ప్రభావాలు పెరగడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది.
సాధారణంగా వచ్చే జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వంటివి వైరస్ల వల్ల వస్తాయి. యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియాపై మాత్రమే పనిచేస్తాయి తప్ప వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఏదైనా మందు వాడే ముందు అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా కాదా అని వైద్యులు నిర్ధారించాలి. పాత ప్రిస్క్రిప్షన్లు చూసి మందులు వేసుకోవడం, బంధువులు లేదా స్నేహితుల సలహాతో మందులు కొనడం, ఎక్కువ డోస్ వేసుకుంటే త్వరగా తగ్గుతుందని భావించడం పూర్తిగా తప్పు అని నిపుణులు చెబుతున్నారు.
యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించాలంటే అసలు ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమ మార్గమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిపుణులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు వాడటం, పరిశుభ్రత పాటించడం, సరైన సమయానికి టీకాలు వేయించుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు. “యాంటీబయాటిక్స్ ఎంతో విలువైనవి, వాటిని దుర్వినియోగం చేసి భవిష్యత్ తరాలకు చికిత్స లేని ఇన్ఫెక్షన్లను మిగల్చవద్దు” అని వైద్యులు పిలుపునిస్తున్నారు.














