23 C
Vijayawada
Saturday, November 21, 2026
Home ఆంధ్రప్రదేశ్ పెళ్లి చేసుకున్నప్పుడు ప్రచారం? విడాకులిస్తే వ్యక్తిగతం? నేతల పెళ్లిళ్లు… విడాకులు.!

పెళ్లి చేసుకున్నప్పుడు ప్రచారం? విడాకులిస్తే వ్యక్తిగతం? నేతల పెళ్లిళ్లు… విడాకులు.!

0
12

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు తన మూడవ భార్య అన్నా లెజినోవాతో విడిపోతున్నట్టు ప్రకటించాక దీని మీద ఎవ్వరూ మాట్లాడొద్దు, అది ఆయన వ్యక్తిగత విషయమని తెలుగుదేశం, వైసిపి పార్టీ అధిష్టానాలు తమ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశాయి. అయితే సోషల్మీడియాని ఎవరూ కంట్రోల్ చెయ్యలేరు. సోషల్మీడియాలో కొంత మంది పవన్ చర్యని తప్పు పట్టారు. రాష్ట్రంలో ఒక ముఖ్యమైన హోదాలో వుండి, ఇలాంటి పనిచేసి ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారని విమర్శలు చేశారు. అది ఆయన వ్యక్తిగతం, దానికి రాజకీయానికి ముడి పెట్టడం తగదని మరికొందరు అభిప్రాయపడ్డారు.

స్థానిక ఎన్నికల హడావుడి ముగిసిన తరువాత ఈ ప్రకటన వెలువడింది కాబట్టి దీని గురించి ఎన్డీయే కూటమి పార్టీలు పెద్దగా ఆందోళన చెందలేదు. అయితే ఈ సందర్భంగా రాజకీయనాయకులకు వ్యక్తిగత జీవితాలుండవా? ఏ చిన్న విషయం జరిగినా పబ్లిక్ లో, మీడియాలో రచ్చ చెయ్యాలా అన్న చర్చ కూడా జరిగింది. పబ్లిక్ లైఫ్ లో వున్నవాళ్లు పెళ్లి చేసుకున్నప్పుడు వార్తల్లోకి ఎక్కించినప్పుడు, విడిపోయినప్పుడు ఎందుకు చర్చించకూడదన్న వాదన కూడా వచ్చింది. మంచైనా, చెడయినా ఒకసారి పబ్లిక్ లైఫ్ లోకి వస్తే కచ్చితంగా చర్చ జరుగుతుంది.

జగన్మోహనరెడ్డి, షర్మిల మధ్య వున్న ఆస్తుల తగాదా వాళ్లిద్దరి వ్యక్తిగతమైనప్పటికీ ఆ విషయమ్మీద పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయంటే కారణం వాళ్లిద్దరూ రాజకీయాల్లో ప్రముఖ స్థానాల్లో వున్నారు అయినా రాజకీయ నాయకులు భార్యలకు విడాకులివ్వడం కొత్త విషయం కాదు. భారత రాజకీయాల్లో చాలా మంది నేతలు భార్యలకు విడాకులిచ్చారు. కొంతమంది మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇంకొందరు పెళ్లి లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు. మన పక్కనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, అతని భార్య సంగీత విడాకులు తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియా అది అతని పర్సనల్ మ్యాటర్ అని వదిలెయ్యలేదు. త్రిషతో ప్రేమ వ్యవహారాన్ని కూడా బయటకు తీశారు. అయితే విజయ్ సీఎం అయ్యాక సంగీత డైవోర్స్ నోటీసుని ఉపసంహరించుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి రాకముందే జశోదాబెన్ తో వివాహం అయింది. కొద్దికాలానికే వాళ్లువిడిపోయి వేర్వేరుగా జీవిస్తున్నారు. అయినా అడపా దడపా సోషల్మీడియాలో విమర్శలు చేసేవాళ్లు చేస్తూనేవుంటారు. వీళ్లు విడిగా వుంటున్నప్పటికీ వీళ్ల వివాహం రద్దయినట్టు ఆధికారిక ఆధారాలైతే లేవు. విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్న రాజకీయనాయకులు చాలా మంది వున్నారు. కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తన మొదటి భార్య రాజ్ కుమారి దేవికి విడాకులిచ్చి, రీనా శర్మని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ రెండో భార్యకు జన్మించారు.

కాంగ్రెస్ నేత శశిథరూర్ మూడు వివాహాలు చేసుకున్నారు.మొదటి భార్య తిలోత్తమ ముఖర్జీ. ఆమెకు విడాకులిచ్చి 2007లో క్రిస్టా గైల్స్ అనే విదేశీ మహిళని పెళ్లాడారు. ఆ తరువాత 2010లో సునందా పుష్కర్ ని మూడో వివాహం చేసుకున్నారు. ఆమె 2014లో మరణించారు. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడాతన భార్య పాయల్ అబ్దుల్లాకు విడాకులిచ్చి ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్నారు. కశ్మీర్ మాజీముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు మెహబూబా ముఫ్తీ తన భర్త జావెద్ షాతో విడాకులు తీసుకున్నారు.. రాజస్థాన్లో మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన భార్య, ఫరూక్ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లా నుంచి విడిపోయారు. ములాయం సింగ్ యాదవ్ తన మొదటి భార్య మరణించాక 2003లో సాధన గుప్తా అనే మహిళని పెళ్లి చేసుకున్నారు.

మన పొరుగున ఉన్న తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య పద్మావతి అమ్మాళ్ మరణించాక తరువాత దయాళు అమ్మాళ్ని పెళ్లి చేసుకున్నారు. ఆవిడకు విడాకులివ్వకుండానే రజతి అమ్మాళ్ అనే మహిళని వివాహం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుగారు తన భార్య బసవరామతారకం మరణించిన పదేళ్ల తరువాత లక్ష్మీపార్వతిని చేసుకున్నారు. అప్పుడు కూడా మీడియాలో, బయట ఈ వివాహం చర్చనీయాంశమయింది. శశి థరూర్ రెండోపెళ్లి, మూడో పెళ్లి మీడియాలో వార్తలయ్యాయి. పబ్లిక్ తో సంబంధం వున్న వాళ్లు, రాజకీయనాయకుల పెళ్లిళ్లు, విడాకుల గురించి చర్చ జరగడం సాధారణ విషయమే. అది వ్యక్తిగతమని ఎంత చెప్పినా జనం మాట్లాడుకోకుండా ఉండలేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.