వంటగదిలో ప్రతిరోజూ అత్యధికంగా వాడే పరికరాల్లో కటింగ్ బోర్డు ఒకటి. కూరగాయలు, మాంసం కోయడానికి వాడే ఈ బోర్డుల విషయంలో చెక్క మంచిదా లేక ప్లాస్టిక్ సురక్షితమా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆహార భద్రతా నిపుణుల పరిశోధనల ప్రకారం.. ప్లాస్టిక్ బోర్డులు కడగడానికి సులభంగా కనిపించినప్పటికీ, కత్తి గాట్లు పడిన తర్వాత ఆ సన్నని గీతల్లో బ్యాక్టీరియా, మాంసం కొవ్వు పేరుకుపోయి చేతితో కడిగినా పూర్తిగా పోవు. మరోవైపు చెక్క బోర్డులు బ్యాక్టీరియాను లోపలికి పీల్చుకున్నప్పటికీ,
వాటిలో ఉండే సహజ యాంటీమైక్రోబయల్ గుణాల వల్ల ఆ క్రిములు వృద్ధి చెందకుండా నశిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బోర్డు వాడుతున్నామనే దానికంటే వాటిని ఎలా శుభ్రం చేస్తున్నామనేదే అత్యంత ముఖ్యం. ప్లాస్టిక్, కాంపోజిట్ బోర్డులను డిష్‌వాషర్‌లో వేసి అధిక వేడితో శానిటైజ్ చేసే వీలుంటుంది కాబట్టి, పచ్చి మాంసం కోయడానికి ప్లాస్టిక్ బోర్డులను వాడటం ఉత్తమం. చెక్క బోర్డులను ఎప్పుడూ చేతితో గోరువెచ్చని సబ్బు నీటితో కడిగి, రెండు వైపులా గాలి తగిలేలా నిలబెట్టి ఆరబెట్టాలి.
పచ్చి మాంసం కోసిన తర్వాత బోర్డులను కేవలం కడగడమే కాకుండా, మరిగే నీరు పోయడం లేదా డైల్యూట్ చేసిన బ్లీచ్‌తో శానిటైజ్ చేయడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుందని ఆహార శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కటింగ్ బోర్డుల నిర్వహణ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెక్క బోర్డులు పగుళ్లు రాకుండా ఎక్కువ కాలం మన్నాలంటే నెలకు ఒకసారి ఫుడ్-సేఫ్ మినరల్ ఆయిల్ రాయాలి. వెల్లుల్లి వాసన పోవాలంటే బేకింగ్ సోడా పేస్ట్‌తో రుద్ది కడగాలి. ఒకవేళ ప్లాస్టిక్ బోర్డుపై లోతైన కత్తి గాట్లు పడినా, లేదా చెక్క బోర్డు పగిలి నల్లటి బూజు మచ్చలు ఏర్పడినా వెంటనే వాటిని మార్చేయడం ఆరోగ్యానికి సురక్షితమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.














