26 C
Vijayawada
Tuesday, November 24, 2026
Home ఆంధ్రప్రదేశ్ ఏపీ రైతులను ముంచేస్తున్న కాలం.. ఒకవైపు కరువు, మరోవైపు వరుస తుపాన్ల దెబ్బ..!

ఏపీ రైతులను ముంచేస్తున్న కాలం.. ఒకవైపు కరువు, మరోవైపు వరుస తుపాన్ల దెబ్బ..!

0
6

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పది జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొనగా, మరోవైపు వరుస తుపాన్లు మిగిలిన పది జిల్లాలను అతలాకుతలం చేశాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయి, రబీ పంట వేసే పరిస్థితి లేక అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు మినహా రాయలసీమ జిల్లాలతో పాటు పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో కరవు ఛాయలు అలుముకున్నాయి.

వర్షాలు లేక ప్రకాశం జిల్లాలో 76 శాతం, మార్కాపురంలో 75 శాతం, కడపలో 53 శాతం, నెల్లూరులో 47 శాతం మేర సాగు విస్తీర్ణం తగ్గిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక కోస్తాంధ్ర జిల్లాలను అక్టోబర్ చివరి వారంలో ‘అర్నబ్’, నవంబర్ మొదటి వారంలో ‘మురసు’ తుపాన్లు తీవ్రంగా దెబ్బతీశాయి. అధిక వర్షాల కారణంగా బాపట్ల, గుంటూరు, ఏలూరు, శ్రీకాకుళం సహా 16 జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు నీటమునిగాయి. చేతికందే దశలో ఉన్న వరి, పత్తి, మినుము తదితర ఖరీఫ్ పంటలు ముంపు బారిన పడటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

పొలాల్లో నిలిచిన వరద నీరు ఇంకా బయటకు పోకపోవడంతో, అధిక వర్షాలు కురిసిన జిల్లాల్లోనూ రబీ సాగు ఆశాజనకంగా లేదు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 22 నాటికి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా రబీ సాగు 7 శాతం మేర తగ్గింది. ఇప్పటికే వరుస నష్టాలతో కుదేలైన రైతాంగానికి వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం ఈ నెలాఖరుకు బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, డిసెంబర్ మొదటి వారం తర్వాత ఇంకో తుపాను కూడా ఏర్పడే అవకాశాలను కొట్టిపారేయలేమని ఏయూ వాతావరణ విభాగాధిపతి ఆచార్య సీవీ నాయుడు వెల్లడించారు. ఒకవైపు లోటు వర్షపాతం, మరోవైపు వరుస తుపాన్ల హెచ్చరికలతో ఏపీ అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.