ఉత్తరాంధ్ర రాజకీయ చదరంగంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక కీలక అడుగు వేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పక్కా గ్రౌండ్ లెవెల్ పట్టున్న సీనియర్ నేత మజ్జి శ్రీనివాసరావును అరకు పార్లమెంట్ అబ్జర్వర్‌గా నియమిస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏజెన్సీ రాజకీయాలను గందరగోళంలో పడేసింది. ఈ నియామకంతో టీడీపీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని జోష్ కనిపిస్తుండగా, దశాబ్దాలుగా తమకు కంచుకోటగా ఉన్న అరకును కాపాడుకునేందుకు వైకాపా రక్షణాత్మక పోరాటం ప్రారంభించాల్సి వచ్చింది.
రాజకీయ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం.. చిన్న శ్రీను కేవలం పదవి వచ్చిన తర్వాత మాత్రమే రంగంలోకి దిగలేదు. ఈ అధికారిక ప్రకటన వెలువడడానికి కొన్ని రోజుల ముందే ఆయన ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పలువురు కీలక గిరిజన నేతలతో నిరంతరం రహస్య భేటీలు జరిపారు. దీనికి ఉదాహరణగా, తెలుగుదేశం పార్టీ పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి పడాల భూదేవి అధికారిక ప్రకటనకు నాలుగు రోజుల ముందే చిన్న శ్రీను క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
రానున్న రోజుల్లో ఏజెన్సీలో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరిద్దరి మధ్య ఆత్మీయ చర్చలు జరగడం చూస్తే, తెరవెనుక ఆపరేషన్ ఎప్పుడో మొదలైందని స్పష్టమవుతోంది. భౌగోళికంగా ఎంతో కఠినమైన ఎస్టీ రిజర్వ్డ్ అరకు పార్లమెంట్ స్థానం రెండు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇందులో పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలు ఉండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయ, పాడేరు, రంపచోడవరం సెగ్మెంట్లు ఉన్నాయి.
ఇందులో మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు చిన్న శ్రీను సొంత ప్రాంతమైన విజయనగరానికి ఆనుకుని ఉండటం ఆయనకు కలిసివచ్చే అతిపెద్ద అంశం. అక్కడి స్థానిక క్యాడర్, నేతలతో ఆయనకున్న పాత అనుబంధమే పునాదిగా, ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉన్న అరకు లోయ, పాడేరు వంటి స్థానాల్లో సమీకరణాలను మార్చడానికి ఆయన వేగంగా పావులు కదుపుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో వైజాగ్, విజయనగరం మైదాన ప్రాంతాల్లో కూటమి బలం ఇప్పటికే సుస్థిరంగా ఉంది.
ఇలాంటి సమయంలో చిన్న శ్రీను వంటి బలమైన నేతను మైదానానికే పరిమితం చేయకుండా, కఠినమైన ఏజెన్సీ సరిహద్దుల్లోకి చంద్రబాబు పంపడం వైకాపాకు పెద్ద షాక్. చిన్న శ్రీను ఇప్పటికే తన కుమార్తె సిరి రాజకీయ భవిష్యత్తును టీడీపీలో భద్రపరుచుకుని, పూర్తి సమయాన్ని అరకుపై కేంద్రీకరించారు. తమ రాజకీయ పునాదులు కదులుతున్నాయని గ్రహించిన పలువురు ద్వితీయ శ్రేణి వైకాపా నాయకులు ఇప్పటికే కండువాలు మార్చుకునేందుకు సిద్ధమవుతుండటంతో, ఏజెన్సీలో సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం వైకాపాకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.














