దేశ రాజధాని ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన జంతర్ మంతర్ నిరసన ప్రదర్శన తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ముంబై నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు సౌరవ్ దాస్ మరియు అశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు ఐజీఐ విమానాశ్రయంలోనే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. అయితే కీలక నేతల అరెస్టుల ద్వారా నిరసనలను అణచివేయవచ్చని భావించిన పోలీసులకు కాక్రోచ్ జనతా పార్టీ తన మాస్టర్ ప్లాన్ తో గట్టి ఝలక్ ఇచ్చింది.
తమ అరెస్టు ఖాయమని ముందే ఊహించిన అభిజీత్ దీప్కే నిన్న రాత్రి ఒక ప్రత్యేక వీడియోను రికార్డు చేశారు. ఆ ముందస్తు వీడియోను ఈరోజు ఆ ముగ్గురు నేతలు కస్టడీలో ఉన్న సమయంలోనే కాక్రోచ్ జనతా పార్టీ తన అధికారిక సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే నాతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టయ్యారని అర్థం అంటూ ఆ వీడియోలో అభిజీత్ దీప్కే పేర్కొనడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే తమ గైర్హాజరీలో ఉద్యమాన్ని ముందుకు నడిపించే కొత్త బాస్ పేరును కూడా అభిజీత్ దీప్కే అధికారికంగా ప్రకటించారు. తాము నిర్బంధంలో ఉన్నంత కాలం జంతర్ మంతర్ వద్ద జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు కాక్రోచ్ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఇన్ ఛార్జ్ అజింక్య షిండే పూర్తి స్థాయిలో నాయకత్వం వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. తమ తర్వాత పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేది షిండేనే అని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అజింక్య షిండేను ఫాలో అవ్వాలని దీప్కే పిలుపునిచ్చారు.
అరెస్టులకు తాము భయపడే ప్రసక్తే లేదని చివరికి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలాంటి అప్రజాస్వామిక పరిస్థితులు లేవని అభిజీత్ దీప్కే మండిపడ్డారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించి మెట్రో స్టేషన్లను మూసివేసినప్పటికీ అజింక్య షిండే ఆధ్వర్యంలో నిరసనలను కొనసాగించి తీరుతామని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యూహాత్మక వీడియో విడుదలతో ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ తన నిరసనల వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా ప్రజా క్షేత్రంలో చర్చను మరింత పెంచగలిగింది.














