బొత్సకు జగన్ బెంగళూరు పిలుపు..?

0
11

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర కంచుకోట అయిన విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా చక్రం తిప్పిన మాజీ నేత మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన వలస వెళ్లిన నాటి నుండి జిల్లాలో వైసీపీకి రోజుకో షాక్ తగులుతోంది. నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వందలాది కుటుంబాలు జెండాలు మార్చేసి సైకిల్ ఎక్కుతున్నారు.

ఈ భారీ వలసలతో జిల్లాలో పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో పార్టీ పతనాన్ని అడ్డుకునేందుకు, డ్యామేజ్ కంట్రోల్ చర్యల కోసం వైఎస్ జగన్, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బెంగళూరుకు పిలిపించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో బలమైన ప్రచారం సాగుతోంది. చిన్నశ్రీను రాజీనామా సమయంలో బొత్స తీవ్ర ఆవేదనకు లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత కూడా చీపురుపల్లి, నెల్లిమర్ల వంటి నియోజకవర్గాల్లో బొత్స అనుచరులు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నారు.

ఈ నేపథ్యంలో, జిల్లాలో పార్టీ క్యాడర్ చేజారిపోకుండా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి..? వలసలకు ఎలా అడ్డుకట్ట వేయాలి..? అనే అంశాలపై చర్చించేందుకే బొత్సను జగన్ బెంగళూరు పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు విజయనగరం అంటే బొత్స సత్యనారాయణ అడ్డాగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అలాగే చిన్నశ్రీను తిరుగుబాటుతో బొత్స సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలోనే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మెరకముడిదం మండలానికి చెందిన 22 మందికి పైగా ముఖ్య నేతలు ఒకేసారి రాజీనామా చేసి టీడీపీ వైపు మొగ్గు చూపారు.

జగన్ రాత్రికి రాత్రి బెల్లాన చంద్రశేఖర్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించి నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో వలసల జోరు మాత్రం తగ్గడం లేదు. ఈ బెంగళూరు భేటీ నిజంగానే జరిగితే.. వలస వెళ్తున్న నేతలను బుజ్జగించే బాధ్యతను జగన్ పూర్తిగా బొత్సకే అప్పగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బొత్స సత్యనారాయణ ఈ సంక్షోభం నుండి విజయనగరం వైసీపీని కాపాడుకోగలరా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.