తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 20 నుంచి 25 వరకు బ్రిటన్, అమెరికా దేశాల్లో పర్యటన తలపెట్టారు. 20న లండన్ వెళ్లి 21,22,23 తేదీల్లో ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూళ్లని సందర్శించి, ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలను హైదరాబాద్ తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి ఈపర్యటన పెట్టుకున్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది తన సంకల్పమని, అందులో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను హైదరాబాద్ కుతీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. లండన్ పర్యటన తరువాత షెడ్యూల్ ప్రకారం 24న అమెరికా వెళ్లి, అక్కడ హార్వర్డ్ యూనివర్శిటీ, బోస్టన్లో ఎంఐటి, వర్జీనియాలో వర్జీనియా టెక్ యూనివర్శిటీ ప్రతినిధులతో సమావేశమవ్వాలి. న్యూయార్క్ లో జరిగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సి వుంది. అయితే లండన్ పర్యటనకు అనుమతిచ్చిన కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనకు అనుమతివ్వడం లేదనికేంద్రం పేర్కొంది.
దీంతో రేవంత్ అమెరికా పర్యటన ఆగిపోయింది. బ్రిటన్ పర్యటనతో ముగించుకుని తిరిగి రావాల్సిన పరిస్థితి. కేంద్రం నిర్ణయం మీద కాంగ్రెస్ పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయకారణాలతో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అడ్డుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. తెలంగాణకు ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలను తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి వచ్చే మైలేజిని అడ్డుకోడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు కేంద్రం అనుమతి ఎందుకు అనే సందేహం కొంతమందికి వస్తుందేమో. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, తమ అధికారిక బ్రుందాలతో అధికారికంగా విదేశీ పర్యటనలు చెయ్యాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. డిప్లొమేటిక్ పాస్ పోర్టులున్నవాళ్లు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకుని వెళ్లాలి. సాధారణంగా కేంద్రం ఇలాంటి పర్యటనలకు అడ్డు చెప్పదు. కానీ ఇప్పుడు రేవంత్ పర్యటనకు అడ్డు చెప్పడం మీదు దుమారం రేగుతోంది.
వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగావుండగా విదేశీ పర్యటనలు చేశారు కదా?ఆయన మీద సిబిఐఈడీ కేసులున్నా ఆయనకు అనుమతులు ఎలా వచ్చాయన్న చర్చ జరుగుతా వుంది. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా విదేశీ పర్యటనలు చెయ్యడానికి కోర్టు పర్మిషన్లు తీసుకున్నారు. అలాగే అధికారిక పర్యటనలకు కేంద్రం అనుమతులిచ్చింది. సీఎంగా ఆయన అధికారిక పర్యటనకు వెళ్లింది 2022లో దావోస్ లో జరిగిన పెట్టుబడుల సదస్సుకే. అది మినహా మిగతావన్నీ ప్రైవేటు పర్యటనలే. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేసేవి ప్రైవేటు పర్యటనలే, సొంత ఖర్చులతో వెళ్తారు కాబట్టి ఆయనకు కోర్టు పర్మిషన్ మినహా కేంద్రం పర్మిషన్ అవసరం లేదు.
ఆయన మీద సిబిఐ కేసులున్నాయి కాబట్టి కోర్టు పర్మిషన్ అవసరం. ఒకవేళ అక్కడ అధికారిక కార్యక్రమాల్లో హాజరయ్యేట్టయితే అప్పుడుకేంద్రం అనుమతులు కావాలి. గతంలో బెంగాల్ సీఎంగా ఉన్నప్పుడు మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుకూడా కేంద్రం ఇలాగే అనుమతి నిరాకరించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు. వీళ్లంతా బిజెపికి ప్రత్యర్థులుగా వుండటం గమనార్హం. రాజకీయ శత్రుత్వం నేపథ్యంలోనే అనుమతి నిరాకరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పొలిటికల్ ఈవెంట్లో పాల్గొంటున్నారు కాబట్టి, అది రాజకీయ కార్యక్రమం, ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధమని కేంద్రం భావించి, అమెరికా పర్యటనకు అనుమతివ్వలేదని తెలుస్తోంది.







