ఖమ్మంలో టియుడబ్ల్యుజె అనే జర్నలిస్టు సంఘం వాళ్లు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికలో దీన్నిహైలైట్ చేశారు. సాక్షి వాళ్లు జగన్ కు అనుకూలంగా ఎవరైనా చిన్న మాట మాట్లాడినా దానికి ప్రాధాన్యత ఇస్తారనేది జగమెరిగిన సత్యం. ఎవరైనా విమర్శించినా, జగన్ లోపాల గురించి మాట్లాడినా దాన్ని ప్రచురించరనే విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ వీరభద్రం చాలా విషయాలు మాట్లాడారు.
సిపిఎం వాళ్ల గెజిట్ పత్రిక అయిన నవ తెలంగాణలో ప్రచురితమైన వార్తని పరిశీలిస్తే కేంద్రంలో బిజెపి రాజకీయాధికారం కోసమే కాకుండా, భారతీయ సమాజ స్వరూపాన్నే మార్చే దుర్మార్గమైన కుట్రలకు పాల్పడుతోందని, తెలంగాణలో అధికారంలో వున్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో వున్న బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.బిజెపి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోంది, సర్ పేరుతో లక్షల ఓట్లు తొలగిస్తున్నారు. క్రైస్తవులు, ముస్లింల ఓట్లు తొలగిస్తున్నారు. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారు. సీఈసీ జ్నానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చెయ్యడంలో విఫలమైంది, కేసీఆర్ అక్రమాస్తుల మీద మాటలు కాకుండా చేతలు చూపిస్తే, ప్రత్యక్ష చర్యలు చేపడితే వామపక్షాలుగా మేం కూడా పోరాటంలో భాగస్వాములవతామని చెప్పారని నవతెలంగాణలో రాశారు. ఇక సాక్షిలో ఇవేమీ రాయలేదు. ఏపీలో 2024లో జరిగిన ఎన్నికల్లో అక్రమాల మీద పరకాల ప్రభాకర్ చేసిన సర్వే వాస్తవాలకు దగ్గరగా వుందని వీరభద్రం పేర్కొన్నట్టు రాశారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయయని, కొన్ని పోలింగ్ బూత్ లలో నమోదైన ఓట్ల కన్నా 500 ఓట్లు అదనంగా పడ్డాయని, ఇదంతా చూస్తుంటే గెలిచింది చంద్రబాబు కాదు, జగన్మోహనరెడ్డి అనేది ఒక అనాలిసిస్ అని వీరభద్రం పేర్కొన్నట్టు మొదటిపేజీలో ప్రముఖంగా ప్రకటించారు.
సాక్షి పత్రిక మిగతా విషయాలన్నీ వదిలేసి, దీన్నే హైలైట్ చేయడం గమనార్హం. వాస్తవానికి నవ తెలంగాణలో దీని ప్రస్తావనే లేదు. అసలింతకీ వీరభద్రం ఏపీ గురించి మాట్లాడారా? చంద్రబాబు కాదు, జగన్ గెలిచేవాడని అన్నారా అని అక్కడ ఉన్న జర్నలిస్ట్ లు చెప్పిన విషయాలు దీనికి భిన్నంగా ఉండటం గమనార్హం. ఎందుకంటే ఒక పత్రికేమో అసలు ఆ ప్రస్తావన చెయ్యలేదు, సాక్షేమో జగన్ గెలిచేవాడని వీరభ్రదం అన్నాడని రాసింది కాబట్టి దీని మీద విశ్లేషణ చేసే ముందు వాస్తవం తెలుసుకోవాల్సి ఉంటుంది.
తమ్మినేని వీరభద్రానికి కమ్యునిస్ట్లో క్యాపిటలిస్ట్ గా పేరుంది. సిపిఎంలో పెద్ద పలుకుబడి ఉన్న నాయకుడిగా చెప్తూ ఉంటారు. ఆయన కార్యదర్శిగా వున్నప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతో దోస్తీకి ఉత్సాహం చూపారు. కానీ కేసీఆర్ మొండిచెయ్యి చూయించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు చర్చలు జరిగినప్పుడు పాలేరు నుంచి ఆయన స్వయంగా పోటీ చేసే ఉద్దేశంతో పాలేరు సీటు గురించి పట్టు పట్టారు. అయితే అక్కడ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కర్చీఫ్ వేసి వుండటం వల్ల కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో పొత్తు కుదరలేదు. సిపిఎం బోణీ చెయ్యలేకపోయింది.
తన ప్రయోజనం కోసం పార్టీ ప్రయోజనాలని పట్టించుకోరని ప్రత్యర్థులు వీరభద్రాన్ని విమర్శిస్తుంటారు. రాష్ట్ర విభజన తరువాత సిపిఎం తెలంగాణలో బీఆర్ఎస్ అనుకూల వైఖరి, ఏపీలో వైసిపి అనుకూల వైఖరి అవలంబించడాన్ని చాలా మంది గమనిస్తునే ఉన్నారు. ఆ విషయాలు పక్కనపెడితే ఏపీలో ఎన్నికల మీద పరకాల సర్వే బాగుంది, జగన్ గెలవాల్సిందని ఆయన అన్నారు. పరకాల ప్రభాకర్ ఎన్నికల రోజు సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన పోలింగ్ శాతానికి, తుది పోలింగ్ శాతానికి భారీ తేడా వుందని చెప్తూ, ఇందులో ఏదో మతలబు ఉందని చెప్తున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం ఓటింగ్ జరిగినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏపీలో వున్న 46 వేల బూత్ ల నుంచి వచ్చిన సమాచారం అది. 5 గంటలకు ప్రకటించారంటే, అంతకు 2 గంటల ముందు అందిన వివరాలన్నీ క్రోడీకరించి ఇచ్చిన రిపోర్టు. మొత్తంగా పోలైన ఓట్ల శాతం 81.86. అంటే 5 గంటలకు ప్రకటించిన దాని కంటే 13.8 శాతం ఎక్కువ. 2019లో జగన్మోహనరెడ్డి గెలిచిన ఎన్నికలని పరిశీలిస్తే, అప్పుడు కూడా సాయంత్రం 5 గంటలకు 65.99 శాతం ఓటింగ్ జరిగినట్టు ప్రకటించారు.
మొత్తం పూర్తయ్యేసరికి అది 80.39 శాతంగా నమోదయింది. అంటే 14.40 శాతం ఓట్లు అదనంగా పోలయ్యాయి. 2019లో, 24లో కూడా 5గంటలకు ఎనౌన్స్ చేసిన పోలింగ్ శాతానికి, ముగిసిన తరువాత ప్రకటించిన శాతానికి 14.40 శాతం తేడా వుంది. 2019లో 14 శాతం తేడా వుంటే, 24లో 13.8 శాతం తేడా వుంది. 5 గంటలకు ఎన్నికల సంఘం పోలింగ్ శాతం ప్రకటించిందంటే, అది ఒక గంట ముందో, రెండు గంటల ముందో 46 వేల పోలింగ్ కేంద్రాల్లో పోలైన శాతం. అన్ని చోట్ల నుంచి వివరాలు తీసుకుని క్రోడీకరించడానికి సమయం పడుతుంది. ఒక గంట ముందు అంటే 4 గంటలకు వచ్చిన సమాచారం అనుకుంటే ఆ తరువాత ఇంకో రెండు గంటలు, ఆరు గంటల వరకు పోలింగ్ సమయం వుంది. రెండు గంటల్లో 13 శాతం పోలింగ్ జరగడం విశేషమేమీ కాదు. పైగా 6 గంటలకు క్యూలైన్లలో వున్నవాళ్లకి టైమ్ అయిపోయినా ఓటు వేసే అవకాశం ఇస్తారు.
మండువేసవి కాబట్టి సాయంత్రం 4 తరువాత పోలింగ్ కేంద్రాలకు వచ్చే వాళ్లు ఎక్కువగా వుంటారు. కాబట్టి అదొక ఇస్యూనే కాదు. 2019లో , 24లో సాయంత్రం 5 తరువాత 13 శాతం పైచిలుకు పోలింగ్ నమోదైంది. అప్పుడు జరిగిన పోలింగ్ ఏమో సహజంగా జరిగినట్టు, ఇప్పుడు జరిగిన పోలింగ్ ఓటు చోరీ అని, ఈవీఎం మ్యాజిక్ అని చెప్పడాన్ని ఎలా చూడాలి? అప్పుడు జరిగింది రైటు. ఇప్పుడు జరిగింది తప్పు ఎలా అవుతుంది అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
కొన్ని పోలింగ్ బూతుల్లో పోలైన ఓట్లకంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు వచ్చాయని వీరభద్రం అన్నారు. అదే నిజమైతే కౌంటింగ్ లో వున్న వైసిపి ఏజెంట్లు ఎందుకు సంతకాలు పెడతారు? ఓడిపోయిన అభ్యర్థులు కోర్టుకెళ్లకుండా ఎందుకు మౌనంగా వుంటారు? లెక్క సరిపోయింది కాబట్టే ఒక్కరు కూడా కోర్టుకెళ్లలేదు. పోనీ ఈ ఆరోపణలు చేసే మేధావులు కోర్టులకెళ్లి, ఏపీ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని, చంద్రబాబు గెలుపుని సవాల్ చెయ్యొచ్చు కదా? వైసిపి వాళ్లు ఇలాంటి ఆరోపణ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ సిపిఎం నేత వీరభద్రం, కొంతమంది మేధావులు చంద్రబాబుది గెలుపు కాదు, ఈవీఎం మ్యాజిక్ అనిప్రచారం చెయ్యడం ఎవరి కోసమన్న చర్చ మొదలైంది.














