వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. ఆ పార్టీ కార్యకర్తలకు పెన్షన్ లు ఇచ్చుకున్నారు, అర్హత లేకపోయినా వారి పార్టీ కార్యకర్తలకు పెన్షన్ లు మంజూరు అయ్యాయి, మరి కూటమి హయాంలో పార్టీ కార్యకర్తల సంగతి పక్కన పెడితే, అర్హులైన వారికి కూడా పెన్షన్ ఎందుకు మంజూరు చేయడం లేదు..? గత రెండేళ్ళ నుంచి ఏపీలో ఏ మూలకు వెళ్ళినా వినపడిన ప్రశ్న ఇది. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కూటమి సర్కార్ సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ తెరపైకి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల మంజూరు కోసం కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సెప్టెంబర్ రెండో వారం నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన వారికి అక్టోబర్ నెల నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే, ఈ కొత్త పింఛన్ల ప్రక్రియ ఒకవైపు సాగుతుండగానే.. మరోవైపు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పెద్ద ఎత్తున రాజకీయ, సామాజిక చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ కాలంలో జరిగిన కేటాయింపులు, ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలపై వస్తున్న విమర్శలు ఎలాంటి సమీకరణాలకు దారితీస్తున్నాయి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఓ లుక్ వేద్దాం.
ప్రభుత్వ తాజా సమాచారం ప్రకారం, కొత్త పింఛన్ల పంపిణీని విడతలవారీగా చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో అత్యంత అవసరమైన వృద్ధులు మరియు వితంతువులకు ప్రాధాన్యత ఇస్తూ పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు విడతలవారీగా దరఖాస్తులను పరిశీలించి పింఛన్లు అందజేస్తారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు సమగ్ర కుటుంబ సర్వే డేటా ఆధారంగా క్షేత్రస్థాయిలో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నారు. పారదర్శకతను పెంచేందుకు ఆరు అంచెల నిబంధనల ద్వారా లబ్ధిదారుల వడపోత జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ పింఛన్ల అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పింఛన్ల కేటాయింపులపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అర్హతలతో సంబంధం లేకుండా, కేవలం రాజకీయ ప్రాతిపదికన మరియు తమ పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకే ప్రాధాన్యత ఇస్తూ పింఛన్లు మంజూరు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనివల్ల నిజమైన అర్హులు కొందరు నష్టపోయారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పట్లో పింఛన్ల వ్యవస్థను వాడుకున్నారనే విమర్శలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపించాయి.
అయితే, ప్రస్తుత తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లబ్ధిదారుల నుండి కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు, కఠినమైన నిబంధనల వల్ల కొత్తగా పింఛన్లు పొందడం కష్టంగా మారిందని కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్దే క్రమంలో ప్రభుత్వం పెట్టిన కండిషన్లు.. నిజమైన పేదలకు కూడా పింఛన్లు రాకుండా అడ్డుపడుతున్నాయనే విమర్శలు ఇప్పుడు ప్రతిపక్షాల నుండి మరియు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పింఛన్ల వ్యవహారం అత్యంత కీలకంగా మారింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలలో పింఛన్ ఒకటి. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియలో ఆలస్యం జరిగినా లేదా అర్హులకు పింఛన్లు అందకపోతే.. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసి, ఎన్నికల లోపే సాధ్యమైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలని చూస్తోంది. ఏది ఏమైనా, సామాజిక భద్రత పింఛన్లు అనేవి పేద కుటుంబాలకు ఒక పెద్ద ఆసరా. రాజకీయాలకు అతీతంగా నిజమైన అర్హులందరికీ న్యాయం జరిగినప్పుడే ప్రభుత్వ సంక్షేమ లక్ష్యం నెరవేరుతుంది.






