ఏకగ్రీవాలైతే తోకలు కట్.. జగన్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదేనా?

0
46

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవుతోంది. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి స్థానిక సంస్థలకు తమ నేతలను, క్యాడర్ ని సమాయత్తం చేసే పనిలో వున్నారు. తెలుగుదేశం శ్రేణులు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్తున్నారు.

వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి ఈసారి ఎక్కడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు. ప్రతి చోటా పార్టీ అభ్యర్థి నిలబడాల్సిందే. అది పంచాయతీ అయినా, మునిసిపాలిటీ అయినా, వైసిపి అభ్యర్థి వుండాల్సిందే అని హుకుం జారీ చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఆ నియోజకవర్గ ఇన్చార్జికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా స్థానికంగా వుండే పరిస్థితులను బట్టి ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగుతంటాయి. సర్పంచ్ మీకు, ఎంపిటిసి మాకు అని గ్రామాల్లో రాజీ పడుతుంటారు. కొన్ని సార్లు గెలిచే పరిస్థితి లేనప్పుడు వదిలేస్తుంటారు. కానీ జగన్ ఆదేశాలతో వైసిపి అన్ని చోట్ల పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది

జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2020 లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కొవిడ్ కారణంగా అప్పటి ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికలు వాయిదా వేశారు. దీని మీద జగన్ మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కులం పేరుతో దూషించారు. ముఖ్యమంత్రిగా వుండి కులాల ప్రస్తావన చేశారు. చంద్రబాబు కులం కాబట్టే ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు. వాస్తవానికి నిమ్మగడ్డకు చంద్రబాబుకు అంత సత్సంబంధాలేం లేవు. ఆయన కొవిడ్ ని ద్రుష్టిలో వుంచుకుని ఎన్నికలు వాయిదా వేశారు. ఆ తరువాత 2021లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సందర్భంగా జగన్మోహనరెడ్డి ఏకగ్రీవాల కోసం పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలు జరిగితే పంచాయతీలకు, మునిసిపాలిటీలకు ప్రోత్సాహకాలుంటాయి, కేంద్రం నుంచి అదనంగా నిధులొస్తాయననని చెప్పారు.

ఏకగ్రీవాలు చెయ్యాలని ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాల కోసం బలప్రయోగాలకు దిగారు. తెలుగుదేశంవర్గీయులని నామినేషన్లు వెయ్యనివ్వలేదు. దాడులు చేశారు. చిత్తూరు జిల్లాలో అంజిరెడ్డి తాత వీళ్లని ధిక్కరించి ప్రాణాలకు తెగించి నామినేషన్ వెయ్యడం, మాచర్లలో తెలుగుదేశం నేతలు వెంకన్న, బొండాలపై దాడి ఘటన జాతీయ స్థాయిలో పతాకశీర్షకలకు ఎక్కాయి. మాచర్ల మునిసిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్లు వెయ్యకుండా చేసి, దాడులు చేసి, అన్ని స్థానాలు ఏకగ్రీవం చేసినందుకు తురక కిషోర్ ని చైర్మన్ని చేశాడు. కొన్ని చోట్ల నామినేషన్లు వేసినవాళ్లని బెదిరించారు. పోలీసులు కూడా ఈ బెదిరింపుల్లో భాగస్వాములయ్యారు.

వీళ్ల అరాచకాలకు కార్యకర్తలు బలవుతున్నారని, చంద్రబాబు ఎంపిటిసి ఎన్నికలను బాయ్ కాట్ చేశారు. అయినా కొన్ని చోట్ల కంటెస్ట్ చేశారు. చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. వూహించనంత అరాచకం చేసి మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించారు. పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చదువురానివాళ్లని ఓటర్లుగా నమోదు చేయించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకగ్రీవాలైతే వూరుకోనని తన పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారంలో వుంటే ఒక తీరు, అధికారం లేకపోతే ఇంకో తీరు, పూటకో మాట చెప్పడం, మడమ తిప్పడంలో జగన్మోహనరెడ్డికి సరిపోయిన నేతలు లేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.