28.9 C
Vijayawada
Tuesday, August 25, 2026
Homeజాతీయ నీతినితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై ఢిల్లీలో కలకలం.!

నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై ఢిల్లీలో కలకలం.!

కేంద్ర మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ జరగబోతోందనే వార్తలు ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న తరుణంలో, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇకపై కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ సంచలన ప్రకటన చేశారు. తాను మునుపటిలా ఎక్కువ సమయం పాటు పనిచేయలేకపోతున్నానని వ్యాఖ్యానించడం ద్వారా.. ఆయన త్వరలోనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి, క్రియాశీల అధికార రాజకీయాల నుండి తప్పుకోబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ వార్తల వేళ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యల వెనుక దశాబ్దాలుగా సాగుతున్న అంతర్గత రాజకీయ సమీకరణాలు ఉన్నాయని జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. నితిన్ గడ్కరీ మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయానికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. పార్టీలో స్వతంత్ర గళాన్ని వినిపించే అతికొద్ది మంది సీనియర్ నేతలలో ఆయన ఒకరు. మోదీ హయాంలో సీనియర్ నేతలైన ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారిని ‘మార్గదర్శక్ మండల్’ పేరుతో క్రియాశీల అధికార రాజకీయాలకు దూరం చేసినా, వెంకయ్యనాయుడుకి ఉపరాష్ట్రపతి పదవిచ్చి మంత్రివర్గం నుంచి తప్పించినా, ఉమాభారతికి రాజకీయ సన్యాసం ఇచ్చినా, నితిన్ గడ్కరీ తన స్థానాన్ని కాపాడుకోగలిగారు.

ఢిల్లీ పీఠంపై మోదీ పట్టు బిగించినప్పటికీ గడ్కరీకి కీలకమైన రోడ్డు రవాణా, రహదారుల శాఖ దక్కడం వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో ఆయనకున్న బలమైన మరియు ప్రత్యక్ష సంబంధాలే ప్రధాన కారణం. నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేసే ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనాయకత్వానికి గడ్కరీ అత్యంత ఇష్టుడు కావడంతో, శాఖల కేటాయింపులో గానీ, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో గానీ బీజేపీ అధిష్టానం ఆయనపై పెద్దగా ఒత్తిడి తీసుకురాలేకపోయింది. తన పనితీరుతో దేశవ్యాప్తంగా ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, పార్టీలోని తన సమకాలీనులందరినీ అధిష్టానం పక్కన పెట్టేయడం.. ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఆయనను మానసికంగా ప్రభావితం చేశాయనే ప్రచారం ఉంది.

వీటికంటే ముఖ్యంగా ఆయన శారీరక ఆరోగ్యం మునుపటిలా సహకరించకపోవడం కూడా క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవాలనే ఆలోచనకు ప్రధాన కారణగా కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిరంతర ప్రయాణాలు, ఒత్తిడితో కూడిన మంత్రి పదవి బాధ్యతలను మోయడం ఈ వయసులో కష్టతరంగా మారిందని ఆయన స్వయంగా అంగీకరించారు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో గడ్కరీకి పదవీవియోగం తప్పదన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించడం ముందస్తు సంకేతంగా భావించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments