మొన్నామధ్య ఆత్మసాక్షి పేరుతో ఒక సర్వేని వైసిపి శ్రేణులు విస్త్రుతంగా ప్రచారం చేశాయి. హైదరాబాద్ ఐఐటియన్స్ చేసిన సర్వేలో జగన్ రెడ్డిని కాబోయే సీఎంగా జనం చూస్తున్నారని, 48 శాతం ఆయనకుమద్దతిచ్చారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపికి 88 స్థానాలు వస్తాయని, కూటమికి గణనీయంగా సీట్లు తగ్గుతున్నాయని వూదరగొట్టేశారు. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ మనోధైర్యం కోల్పోకుండా వుండేందుకు, పోటీకి ముందుకొచ్చేందుకు వైసిపి వేసిన ఎత్తుగడ అని వైసిపి మీడియాల్లో, సోషల్మీడియా హ్యాండిల్స్ లో దీని గురించి విపరీతంగా పోస్టులు పెట్టారు.
ఇంకేముందు జగనన్న వచ్చేస్తున్నాడని హడావుడి చేశారు.సరిగ్గా వారం తిరిగేసరికి ఇండియా టుడే, సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వివరాలు వచ్చాయి. అన్నవచ్చేస్తున్నాడని హడావుడి చేసినవాళ్ల గొంతులో వెలక్కాయలు పడ్డాయి. ఇండియా టుడే జాతీయ స్థాయిలో లోక్ సభ సీట్లు ప్రామాణికంగా, యాక్సిస్ మై ఇండియా లేదా సిఓటర్ సహకారంతో సర్వేలు చేస్తుంది. ఈ సర్వేకి మిగతా సర్వేలకంటే క్రెడిబిలిటీ ఎక్కువ.గత పదేళ్లలో ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా కలిసి చేసిన సర్వేలు అధికశాతం నిజమయ్యాయి. ఈ సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏడాదికి రెండు సార్లు సర్వేచేస్తుంది. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా సర్వే చేసింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి 45 శాతం ఓట్ షేర్ తో 326 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 39 శాతం ఓట్ షేర్ తో 185 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఎన్డీయేలో బిజెపికి 261 సీట్లు, భాగస్వామ్య పక్షాలకు 65 సీట్లు వస్తాయని అంచనా వేసింది.ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో 20 ఎన్డీయేకి, 5 వైసిపికి వస్తాయని సర్వే వెల్లడించింది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం వుంది. తెలుగుదేశం, జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఇప్పటికీ ఆధిక్యంలోనే వున్నాయి, కానీ బిజెపి పోటీ చేసిన ఆరింట్లో అయిదు చోట్ల వెనకబడింది.
బిజెపి గత ఎన్నికల్లో 6 సీట్లకు పోటీ చేసి 3 సీట్లే గెలుచుకుంది. ఇప్పుడు ఆ మూడు లో కూడా రెండు ఓడిపోతోంది. కేవలం ఒక్క సీటే గెలుస్తుందని అంచనా వేశారు. మిగతా 5 సీట్లు వైసిపి ఖాతాలోకిపోతున్నాయి.కడప లోక్ సభ కూడా వైసిపి ఓడిపోతుందని అంచనా వేశారు. వైసిపి వచ్చే సీట్లన్నీ బిజెపికిచ్చిన స్థానాలు కావడం ఇక్కడ గమనించాలి. ఇదే ఇండియా టుడే గత జనవరిలో చేసిన మూడ్ఆఫ్ ది నేషన్ సర్వేలో ఎన్డీయేకి 24, వైసిపికి ఒక్క సీటే వస్తుందని వెల్లడించారు.
ఈసారి ఎన్డీయే బలం కొంత తగ్గింది. గత ఎన్నికల్లో ఎన్డీయే ఓట్ షేర్ 54 శాతం వుంటే,, ఈ సర్వేలో 52 శాతానికి తగ్గింది. వైసిపి 39.5 నుంచి 41 శాతానికి పెరిగింది.2024 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఇండియా టుడే జరిపిన సర్వేలో తెలుగుదేశానికి 17 సీట్లు, వైసిపికి 8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టుడే సర్వేలు ఫలితాలకు దగ్గరగా వుంటాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ 4 సీట్లు, బిజెపి 9 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. ఈ 13 పోను మిగిలిన నాలుగు సీట్లలో ఒక సీటు మజ్లిస్ కిపోతే, మూడు సీట్లు బిఆర్ఎస్ గెలవొచ్చు. ఈ రెండు పార్టీలు అదర్స్ జాబితాలో వున్నాయి.అయితే ఈ సర్వే మీద గ్రేట్ ఆంధ్రా వాళ్లు ఒక ఆర్టికల్ రాశారు. దాని సారాంశం ఏంటంటే కడపలో వైసిపి ఓడిపోతుందని ఇచ్చారు.
కడప లాంటి చోట వైసిపి ఓడిపోతుందంటే ఈ సర్వే నిజం కాదని రాసుకొచ్చారు. అయితే ఈ సర్వే వైసిపి వాళ్లకుఅలవాటయిన ఫేక్ సర్వే కాదు. జడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి పురిటిగడ్డ పులివెందులనే కొట్టగా లేంది కడపని కొట్టడం పెద్ద లెక్కేం కాదు. మొన్నటి ఎన్నికల్లో షర్మిల బరిలో లేకపోతే కడప కూడా తెలుగుదేశం కైవసం చేసుకునేది.స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు దిగజారిన క్యాడర్ ని లేపడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఒక ఫేక్ సర్వే వదిలి, ఆస్థాన విద్వాంసులతో, తెలకపల్లి, నాగేశ్వర లాంటి మేధావులతో డప్పులు కొట్టించి వారం కాకముందే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వీళ్లని డిఫెన్స్ లో పడేసింది.
కీలకమైన సమయంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేసింది. జగన్మోహనరెడ్డి పోటీ చెయ్యాల్సిందే అని హుకుం జారీ చేస్తే నామినేషన్ వేసి ఇంట్లో కూర్చోడం మినహా రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో అభ్యర్థులుండరు. చంద్రబాబు మేయర్ మునిసిపల్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక పెట్టి సాహసం చేస్తున్నారేమో అనిపించింది. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వున్నారా అనిపించింది. అయితే కూటమి గెలుపు మీద నమ్మకమైన ఫీడ్ బ్యాక్ వుండటం వల్లే ఈ సాహసోతపేతమైన నిర్ణయం తీసుకున్నారనుకోవాలి. ఇప్పుడీ సర్వే కూడా అదే రుజువు చేస్తోంది.






