కేంద్ర ఎన్నికల కమిషనర్ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సర్ మన రాష్ట్రంలో దాదాపుగా పూర్తయింది. ముసాయిదా జాబితాలు విడుదల చేశారు. దీని మీద అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆగస్టు 31 వరకు పౌరుల నుంచి క్లెయిమ్‌లు, సవరణలు, అభ్యంతరాలు నమోదు చేస్తారు. సెప్టెంబరు 28 వరకు వీటిని పరిశీలించి, పరిష్కరించి, అక్టోబరు 3న ఫైనల్ గా ఓటర్ల జాబితాని ఖరారు చేస్తారు. ఇప్పటికైతే 45 లక్షల ఓట్లు తొలగించాల్సిన జాబితాలో వున్నాయి. ఇందులో 15 లక్షలమంది చనిపోయినవాళ్లున్నారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు 7 లక్షలు పైనే. మిగతా 23 లక్షల ఓట్లు బోగస్ ఓట్లుగా భావించాలి.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వీలైతనం త్వరగా నిర్వహించాలన్న ఆలోచనతో వుంది. ముందుగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, తరువాత మండలాలు, జడ్పీలకు, ఆ తరువాత సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే నిన్న ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరిగిన భేటీలో పాత ఓటర్లజాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారని వార్తలొచ్చాయి. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిపితే, మళ్లీ వార్డుల రిజర్వేషన్లు మారిపోతాయి, కొత్త జాబితాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చెయ్యాలి, ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతుంది కాబట్టి పాత జాబితాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు అభిప్రాయపడ్డారంట. ఇదొక తెలివితక్కువ నిర్ణయం అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూస్తే ఈ నిర్ణయం ఆ పార్టీకి నష్టం చేసే అవకాశం వుంది.
ఎందుకూ అంటే వైసిపి హయాంలో పెద్ద ఎత్తున దొంగ ఓటర్లని చేర్చారు. తెలుగుదేశం చాలా చోట్ల దీని మీద ఫైట్ చేసింది. కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కేసులు పెట్టారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో తమిళనాడు నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లని తీసుకొచ్చారు. సర్ లో దొంగ ఓటర్లు ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లో తిరుపతి, చంద్రగిరి, కర్నూలు, గాజువాక ఉన్నాయి. తిరుపతిలో 90 వేల ఓట్లు సర్ లో గల్లంతయ్యాయి. ఇప్పుడు పాత జాబితాల ప్రకారం ఎన్నికలు జరిగితే, తమిళనాడు ఓటర్లంతా బస్సుల్లో మళ్లీ వస్తే అప్పుడు పరిస్థితేంటి? గ్రామాల్లో అయితే ఏజెంట్లు మనిషిని గుర్తుపట్టే అవకాశం వుంటుంది. అర్బన్ ఏరియాస్ లో దొంగ ఓటర్లని గుర్తించలేరు.
పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఎన్నికల్లేవు. గ్రామాల్లో ఎన్నికల్లేవు కాబట్టి దొంగ ఓటర్లంతా మునిసిపల్ ఎన్నికల్లో యాక్టివ్ అయిపోతారు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాడో పేడో అన్నట్టుగా ప్రత్యక్ష ఎన్నికలు పెడుతున్నారు. నేరుగా మేయర్, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేస్తారు. గతంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చైర్మన్ని, మేయర్ ని ఎన్నుకునే సిస్టం వుండేది. ఇప్పుడు దాన్ని మార్చేస్తున్నారు. నేరుగా ఎన్నుకోవడం మంచి పద్ధతే. గతంలో ఎన్టీఆర్ సీఎంగా వున్నప్పుడు జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులకు కూడా నేరుగా ఎన్నిక నిర్వహించారు. కేంద్రం అయిదంచెల వ్యవస్థ ప్రవేశపెట్టి జడ్పీటీసీ, ఎంపీటీసీలంటూ దిక్కుమాలిన పదవులని ప్రవేశపెట్టింది. ప్రత్యక్ష ఎన్నిక మంచిదే, అధికారంలో వున్న పార్టీ గేమ్స్ ఆడలేదు.
మేయర్లని అవిశ్వాసం ద్వారా దించే అవకాశం కూడా వుండదు. అధికార పార్టీ ఆధిపత్యం చూపించే అవకాశం వుండదు. ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేశారు కాబట్టి పాత ఓటర్ల జాబితాల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామంటే దొంగ ఓటర్లను యాక్టివేట్ చేసినట్టే. సర్ లెక్కల ప్రకారం 23 లక్షల మంది దొంగ ఓటర్లున్నారు. వైసిపి అధికారంలో వున్నప్పుడు నమోదు చేయించిన ఓట్లు. ఆ ఓట్లు కూటమికి నష్టం చేస్తాయి. జనరల్ ఎన్నికల్లో నష్టం జరగలేదు కదా అని వాదించే తెలివికలవాళ్లు కూడా వుంటారు.
ఒకటి, జనరల్ ఎన్నికలలో వైసిపి పాలన మీద విరక్తి చెందిన జనం సునామీలాంటి తీర్పు ఇచ్చారు. రెండు, జనరల్ ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో, అన్నిజిల్లాల్లో తేదీల తేడాతో ఒకేసారి జరిగాయి. కాబట్టి దొంగ ఓట్లకు అవకాశం తగ్గింది. ఇప్పుడు ముందు మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయి. గ్రామాల నుంచి దొంగలని తరలించి ఓట్లు వేయిస్తారు. కాబట్టి వార్డుల రిజర్వేషన్లు కాస్తా ఆలస్యమైనా, సర్ లో ఖరారైన జాబితాతో, అసలైన ఓటర్లతో ఎన్నికలు నిర్వహించడం అధికార కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది.







