భారత క్రికెట్‌లో వింత సినారియో.. అసలేం జరిగింది..?

0
3

భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాబోయే అక్టోబర్ నెలలో ఒక అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఒకే రోజు రెండు వేర్వేరు దేశాల్లో, రెండు వేర్వేరు ఫార్మాట్లలో ఇద్దరు వేర్వేరు కెప్టెన్ల నేతృత్వంలో టీమిండియా తలపడనుంది. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా ప్రతిష్టాత్మక ‘ఆసియా క్రీడలు 2026’ (Asian Games 2026) పురుషుల క్రికెట్ టోర్నమెంట్ జరగనుండగా, అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది.

ఈ రెండు సిరీస్‌లు ఒకే సమయంలో క్లాష్ అవుతుండటంతో.. బీసీసీఐ రెండు బలమైన జట్లను రెండు వేర్వేరు టోర్నీలకు పంపించేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ షెడ్యూల్ క్లాష్ కారణంగా టీమిండియా స్టార్ బ్యాటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరం కానున్నారు. అయితే ఆయన జట్టుకు దూరం కావడం వెనుక ఎలాంటి గాయం గానీ, విశ్రాంతి గానీ కారణం కాదు.. దానికి ఒక బలమైన వ్యూహాత్మక కారణం ఉంది.

ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగుతున్న భారత పురుషుల జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించింది. అక్టోబర్ 3న జపాన్‌లో ఆసియా క్రీడల మెడల్ మ్యాచ్‌లు జరగనుండగా, సరిగ్గా అదే రోజున చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో భారత్ మూడో వన్డే ఆడనుంది. అయ్యర్ ఆసియా క్రీడల లీడర్‌షిప్ బాధ్యతల్లో బిజీగా ఉండటం వల్లే విండీస్ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా క్రీడల్లో నేరుగా సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్స్ ద్వారా బరిలోకి దిగనుంది.

అంతకంటే ముందే సెప్టెంబర్ 22న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా జపాన్‌తో అయ్యర్ సేన తలపడాల్సి ఉంది. ఈ క్రేజీ ఆసియా క్రీడల భారత జట్టులో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఈ మెగా టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఖచ్చితంగా స్వర్ణ పతకాలు సాధించి దేశ కీర్తిని నిలబెడతాయని బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ ధీమా వ్యక్తం చేస్తూ జట్టుకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.