ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేదల వైద్యం, ఆరోగ్య భద్రత అనే అంశాలు వచ్చినప్పుడు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ‘పేదల ఆపద్బాంధవుడు’ అని, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా అలాగే ఆ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తూ ఉంటాయి. అయితే, కేవలం ప్రచారాల కంటే అధికారిక లెక్కలు, క్షేత్రస్థాయిలో విడుదలైన నిధుల డేటాను గమనిస్తే వాస్తవాలు చాలా భిన్నంగా ఉన్నాయి.
నిరుపేదల అత్యవసర వైద్య సహాయం కోసం ఇచ్చే ముఖ్యమంత్రి సహాయ నిధి కేటాయింపులలో వైఎస్సార్, జగన్ హయాంల కంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అత్యధిక నిధులు ఇచ్చి అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో మరీ ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా తమ నియోజకవర్గ ప్రజలకు నిధులు మంజూరు చేయించడంలో మంత్రి నారా లోకేష్, మంత్రి గొట్టిపాటి రవికుమార్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి రికార్డు సృష్టించారు.
అధికారిక రికార్డుల ప్రకారం.. రాష్ట్రంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల కోసం కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో నిధులను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే ఏకంగా రూ. 1,722 కోట్ల భారీ నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.91 లక్షల మంది నిరుపేద కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరింది.
గత 15 ఏళ్ల రాజకీయ కాలాల సీఎంఆర్ఎఫ్ కేటాయింపులను పరిశీలిస్తే.. 2004 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ. 752 కోట్లు మాత్రమే. అలాగే, 2019 నుండి 2024 వరకు గత వైఎస్ జగన్ ఐదేళ్ల హయాంలో కేవలం రూ. 940 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ రెండు కాలాల కంటే చంద్రబాబు ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల లోపే రూ. 1,722 కోట్లు ఖర్చు చేసి చూపింది.
ఇక ఈ నిధుల మంజూరు ప్రక్రియలో ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల నుండి వచ్చిన దరఖాస్తులను ఎంత వేగంగా సిఫార్సు చేసి నిధులు సాధించారనేది కూడా అత్యంత కీలకం. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులందరి కంటే మంగళగిరి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రథమ స్థానంలో నిలిచారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నిరుపేదలు, బాధితుల నుండి వచ్చిన వేలాది దరఖాస్తులను స్వయంగా పర్యవేక్షించి, అత్యధిక సంఖ్యలో ఎల్ఓసి పత్రాలు, మెడికల్ బిల్లుల రీయింబర్స్‌మెంట్ నిధులను లోకేష్ మంజూరు చేయించారు.
ఇదే క్రమంలో అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ద్వితీయ స్థానంలో నిలిచారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కోసం గొట్టిపాటి రవికుమార్ నిరంతరం ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రతీ వారం కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్ఓసి పత్రాలను నేరుగా బాధితులకు అందజేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావడానికి నెలల తరబడి సమయం పట్టేది, దళారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దళారుల ప్రమేయం లేకుండా, లంచాలకు తావు లేకుండా ఉండేందుకు పరిపాలనలో పూర్తి డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి ఆన్‌లైన్ వెరిఫికేషన్ ద్వారా మధ్యవర్తులు లేకుండా చూస్తున్నారు. దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల దరఖాస్తులను కేవలం 48 గంటల్లోనే క్లియర్ చేసి ఎల్ఓసి పత్రాలను అందిస్తున్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో దీని కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, రోగి ఆసుపత్రిలో చేరిన వెంటనే ముందస్తు నిధులు పొందేలా రోజుకు సుమారు 70 నుంచి 110 ఎల్ఓసిలను తక్షణమే జారీ చేస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు.






