రాబోయే గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి యువ నాయకత్వానికి పెద్ద పీట వేయాలని కూటమి భావిస్తున్న తరుణంలో, బెజవాడ మేయర్ రేసు ఊహించని మలుపు తిరిగింది. విజయవాడలో బలమైన పట్టున్న దేవినేని కుటుంబం నుండి యువ వారసులు రంగంలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా దేవినేని చందు, ఆయన సతీమణి మహిత కలిసి మంత్రి నారా లోకేష్‌ను కలవడంతో బెజవాడ మేయర్ అభ్యర్థిత్వంపై సరికొత్త ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయి.
సాధారణంగా విజయవాడలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఈ తరుణంలో దేవినేని చందు ఫ్యామిలీ ముందే అలర్ట్ అయ్యి మంత్రి లోకేష్ వద్ద తమ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో దేవినేని మహిత పేరును కూడా మేయర్ రేసులో పరిశీలించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వారు పంచుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
అయితే, బెజవాడలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తమ వారసుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో కూటమిలో టికెట్ పోరు ఆసక్తికరంగా మారింది. అధిష్టానం అందరి ట్రాక్ రికార్డులను, నియోజకవర్గాల వారీగా ఉన్న బలాబలాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. పార్టీ గెలుపే పరమావధిగా అడుగులు వేస్తున్న వేళ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.














