విజయవాడ వేదికగా జరిగిన వైద్య ఆరోగ్య శాఖ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పలు కీలక సూచనలపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయతలపెట్టిన ‘క్వాంటం బయో వ్యాలీ’కి జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు. దీనిపై తదుపరి చర్చలు జరపడానికి, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఉన్నత స్థాయి సాంకేతిక బృందాన్ని త్వరలోనే అమరావతికి పంపుతామని నడ్డా ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ కార్యక్రమంపై కూడా కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. ఏపీలో అమలు చేస్తున్న ఈ వినూత్న ఆరోగ్య కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దూరదృష్టిని, పరిపాలనా దక్షతను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేకంగా కొనియాడారు. ముఖ్యంగా ‘కిచెనే ఫార్మసీ-ఆహారమే ఔషధం’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నడ్డా తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావిస్తూ శభాష్ అన్నారు.
ప్రజల ఆరోగ్యం వంటగది నుంచే ప్రారంభమవుతుందనే చంద్రబాబు ఆలోచన అద్భుతమని అభినందించారు. వైద్య రంగంతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తిపై చంద్రబాబు చూపిస్తున్న చిత్తశుద్ధిని, పట్టుదలను ఆయన అభినందించారు. ఈ అధికారిక కార్యక్రమం ముగిసే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి వేదికపైనే సరదాగా సెల్ఫీ దిగడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఏపీ ఆరోగ్య రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ఇరు నేతలు స్పష్టం చేశారు.













