పవర్ లేకపోతే రాష్ట్రం తగలబడిపోయినా పర్లేదు.. తాము సీఎం సీట్లో కూర్చోకపోతే ఎంతటి మెగా ప్రాజెక్ట్ అయినా మట్టికొట్టుకుపోయినా పర్లేదు. ఇదా.. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఆలోచించే విధానం..? ఒకప్పుడు గ్లోబల్ కంపెనీల ముందు మోకరిల్లి.. “మా రాష్ట్రానికి రండి, ఇన్వెస్ట్ చేయండి” అని బ్రతిమిలాడిన ఒక మాజీ ఐటీ మంత్రి.. ఈరోజు అదే నోటితో “మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకండి.. పెడితే మీరు బలి పశువులు అవుతారు” అని అంతర్జాతీయ ఇన్వెస్టర్లను భయపెడుతుంటే ఏమనాలి..?
తెలంగాణ ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేస్తున్నాయి. ఈ వైఖరి చూస్తుంటే.. నాడు ఏపీని ఐదేళ్ల పాటు సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి ‘అమరావతి విధ్వంసక’ మైండ్‌సెట్ గుర్తుకొస్తోంది. అసలు కేటీఆర్, జగన్ ఇద్దరిదీ ఒకే స్కూలా..? పవర్ లేకపోతే అభివృద్ధిని నిరోధించడమే వీరి ఏకైక ఎజెండానా..? ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్.
తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు.. మహేశ్వరం, ముచ్చర్ల పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తోంది. కానీ, కేటీఆర్ అక్కడ పర్యటించి ఏం మాట్లాడారు..? “ఇది ఫ్యూచర్ లేని సిటీ.. ఇక్కడ రియల్ ఎస్టేట్ నాటకంలో ఎవరూ బలి కావొద్దు” అంటూ ఓపెన్‌గా ఇండస్ట్రీని బెదిరిస్తున్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ఫ్యూచర్ సిటీ అనేదే ఉండదంటూ ఒక పొలిటికల్ వార్నింగ్ ఇస్తున్నారు. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషనో.. లేక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే కుళ్లుతోనో తెలియదు కానీ..
కేటీఆర్ ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్ చూసి పారిశ్రామికవేత్తలు షాక్‌కు గురవుతున్నారు. ఒకప్పుడు ఇన్వెస్టర్ల నమ్మకం గురించి లెక్చర్లు దంచిన కేటీఆరేనా.. ఈరోజు ఒక అంతర్జాతీయ ప్రాజెక్టును గొంతు కోసి చంపాలని చూస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే విధ్వంసకర రాజకీయాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని గ్లోబల్ క్యాపిటల్‌గా మార్చడానికి అడుగులు వేస్తే.. ప్రతిపక్షంలో ఉన్న జగన్ దాన్ని అడ్డుకోవడానికి ప్రతి రోజూ విషప్రచారం చేశారు.
తాము అధికారంలోకి వస్తే అమరావతిని ఉండనివ్వబోమని ఇన్వెస్టర్లను భయపెట్టారు. అన్నట్లుగానే 2019లో పీఠం ఎక్కగానే.. మూడు రాజధానుల తుగ్లక్ డ్రామాతో అమరావతిని శ్మశానంగా మార్చేశారు. ఫలితం ఏమైంది..? వేల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు పారిపోయాయి, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, లక్షలాది మంది యువత బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్‌కో, బెంగళూరుకో వలస వెళ్లాల్సి వచ్చింది. కేవలం చంద్రబాబుపై కక్షతో.. ఏపీ భవిష్యత్తును ఐదేళ్లు వెనక్కి నెట్టేసిన సైకో రాజకీయాన్ని దేశం మొత్తం చూసింది.
ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ కూడా అచ్చుగుద్దినట్లు అదే జగన్ రాసిన విధ్వంసక స్క్రిప్ట్‌ను అమలు చేస్తున్నారు. తాము అధికారంలో లేనప్పుడు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు.. యువతకు ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు.. కానీ ప్రభుత్వానికి మైలేజ్ రాకూడదు. ఇద్దరిదీ ఒకటే స్కూల్.. ఒకటే థియరీ. జగన్ అమరావతిని ఆపేస్తానని చెప్పి ఏపీలో ఎలాగైతే ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సర్వనాశనం చేశారో.. ఇప్పుడు కేటీఆర్ కూడా ఫ్యూచర్ సిటీపై అలాంటి నమ్మకద్రోహానికి తెరలేపుతున్నారు.
ఏ అంతర్జాతీయ సంస్థ అయినా వందల కోట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు.. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వాన్ని చూస్తుంది. కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేత “మేం వస్తే ప్రాజెక్ట్ రద్దు చేస్తాం” అని ఓపెన్‌గా స్టేట్‌మెంట్లు ఇస్తుంటే.. ఇన్వెస్టర్లు భయపడి వెనక్కి తగ్గుతారు. కేటీఆర్ చేస్తున్న ఈ పాపం.. కాంగ్రెస్ పార్టీకి కాదు, నేరుగా తెలంగాణ యువత భవిష్యత్తుకు తగులుతుంది. రాజకీయాల్లో కక్షలు ఉండొచ్చు.. ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయొచ్చు. అంతేకానీ, రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రానికి వచ్చే లక్ష్మిని తరిమేస్తామనడం ముమ్మాటికీ ద్రోహమే.
నాడు అమరావతిని నాశనం చేసిన జగన్ రెడ్డికి ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో ఎలాంటి ఘోర పరాజయాన్ని కానుకగా ఇచ్చారో కళ్లముందే ఉంది. 151 సీట్ల నుంచి సింగిల్ డిజిట్‌కు పడిపోయినా జగన్‌కు బుద్ధి రాలేదు. మరి ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ కూడా అదే విధ్వంసకర, అభివృద్ధి నిరోధక ఎజెండాతో ముందుకు వెళ్తే.. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అంతకంటే ఘోరమైన సమాధి కట్టడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.











