భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే వెస్టిండీస్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లకు గట్టి నిరాశే ఎదురైంది. విండీస్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసిన తుది జట్లలో ఈ ఇద్దరు సీనియర్ పేసర్లకు చోటు దక్కలేదు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 28 వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్ కుమార్‌ను, అలాగే దేశీవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్న మహ్మద్ షమీని సెలెక్టర్లు పక్కన పెట్టడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఎంపికపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షమీ, భువిల విషయంలో రాసిన రాత గోడ మీద స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. టీ20 ఫార్మాట్‌లో భువనేశ్వర్ గురించి, వన్డే ఫార్మాట్‌లో మహ్మద్ షమీ గురించి సెలెక్టర్లు ఆలోచించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వారిని పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త వాళ్ల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. భారత జట్టులోకి ఆకిబ్ నబీ, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ లాంటి యువ బౌలర్లకు పెద్దపీట వేస్తుండటమే దీనికి నిదర్శనమన్నారు.
అభిమానులు కూడా ఈ చేదు నిజాన్ని అంగీకరించి, ‘మూవ్ ఆన్’ అవ్వక తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు, టీమిండియాకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న మహ్మద్ షమీ ఇటీవల దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడి తన కెరీర్‌లో 100వ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ మైలురాయిని అందుకున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ డొమెస్టిక్ షేర్ చేసిన వీడియోలో షమీ మాట్లాడుతూ.. 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడటం అనేది ప్రతి క్రికెటర్‌కు ఒక కల, జీవిత ఆశయమని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్ల త్యాగం, కష్టం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని, జట్టులోకి మళ్ళీ రావడంపై తన ఆకలి ఎప్పటికీ తగ్గదని పేర్కొన్నారు. ఏదేమైనా భవిష్యత్తు సిరీస్‌లలో యువ బౌలర్లకే అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ గట్టిగా నిర్ణయించుకోవడంతో.. ఈ ఇరు సీనియర్ల అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగింపునకు వచ్చినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.














