ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక కృషితో రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కీలక సమావేశంలో రాష్ట్రంలో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించేలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో రూ. 526.25 కోట్ల పెట్టుబడులతో, ఏకంగా 8,896 మంది యువతకు ప్రత్యక్ష ఉపాధి కల్పించే 10 భారీ ఐటీ ప్రాజెక్టులకు SIPB అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.
ఈ సరికొత్త ఐటీ విప్లవానికి వైజాగ్ ప్రధాన కేంద్రంగా మారబోతోంది. ప్రపంచ ప్రసిద్ధ కన్సల్టింగ్ దిగ్గజ సంస్థ ‘డెలాయిట్’ వైజాగ్‌లో తన సామ్రాజ్యాన్ని విస్తరించనుంది. రూ. 43.75 కోట్ల పెట్టుబడితో, ఏకంగా 2,500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న డెలాయిట్ ప్రతిపాదనకు SIPB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సెంటర్ ఏర్పాటుతో విశాఖ రాత మారనుండటమే కాకుండా, స్థానిక ఐటీ నిపుణులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభించనున్నాయి.
టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సైతం విశాఖ వేదిక కానుంది. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ‘ముత్తూట్ ఫిన్‌కార్ప్’ వైజాగ్ వేదికగా ఐటీ, ఏఐ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. రూ. 100 కోట్ల భారీ పెట్టుబడితో, 2,400 సీట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన కేంద్రాన్ని ముత్తూట్ ఏర్పాటు చేయనుంది. నారా లోకేష్ ఢిల్లీ, బెంగళూరు, గ్లోబల్ టెక్ సదస్సులలో పారిశ్రామికవేత్తలతో జరిపిన నిరంతర చర్చలు, కూటమి ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక ఐటీ పాలసీల వల్లే ఈ స్థాయిలో దిగ్గజ సంస్థలు ఏపీకి క్యూ కడుతున్నాయని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.











