30 C
Vijayawada
Sunday, August 30, 2026
HomeUncategorizedరూ.100 అప్పుకి 3 పైసలతో సెటిల్మెంటా!!? దేశాన్ని ముంచుతున్న కార్పొరేట్లు.!

రూ.100 అప్పుకి 3 పైసలతో సెటిల్మెంటా!!? దేశాన్ని ముంచుతున్న కార్పొరేట్లు.!

జీ టీవీ, ఎస్సెల్ గ్రూప్ ల వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు ఎన్ సిఈఎల్టీలో లభించిన భారీ వూరట గురించి రెండు రోజులుగా మీడియాలో, రాజకీయవర్గాల్లో, బ్యాంకింగ్ వర్గాల్లో, ప్రజల్లో కూడా చర్చ జరుగుతా వుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సుభాష్ చంద్ర మీద వున్న 22 వేల 6 కోట్ల రూపాయల క్లెయిములకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది.

మొత్తం 22 వేల కోట్లకు 6 కోట్ల 25 లక్షలు అప్పుల పరిష్కారానికి, 25 లక్షలు ప్రాసెసింగ్ ఖర్చులకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ 22 వేల కోట్లు మొత్తం సుభాష్ చంద్ర బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి నేరుగా తీసుకున్న రుణం కాదు. వివిధ కంపెనీలకు ఆయనిచ్చిన పర్సనల్ గ్యారెంటీల మొత్తం అది. రుణాలు తీసుకున్న కంపెనీల నుంచి బ్యాంకులు వసూలు చేసుకునేందుకు చట్టపరమైన చర్యలు కొనసాగించవచ్చు.

సాధారణంగా మనం బ్యాంకుల దగ్గర రుణం తీసుకున్నప్పుడు లేదా ఎవరికైనా హామీ ఇచ్చినప్పుడు రుణం తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీ ఇచ్చినందుకు బ్యాంకులు మనకు నోటీసులు జారీ చేసి, మన దగ్గర నుంచి వసూలు చేస్తాయి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం రుణం తీసుకున్న వ్యక్తికిఎంత బాధ్యత ఉంటుందో, గ్యారంటీ ఇచ్చిన వ్యక్తికి కూడా అంతే బాధ్యత వుంటుంది. రుణం చెల్లించడంలో రుణగ్రహీత విఫలమైతే, ఆ బాధ్యత గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి మీదకుమారుతుంది.

రుణ గ్రహీత ఆస్తులన్నీ వేలం వేసిన తరువాతే గ్యారంటర్ దగ్గరకు రావాలనే నిబంధన ఏమీ లేదు. ఇక్కడ సుభాష్ చంద్ర బయట ఎవరో వేరే వాళ్ల కంపెనీలకు పూచీకత్తు ఇవ్వలేదు. తన సొంత సంస్థ ఎస్సెల్ గ్రూప్ కు చెందిన వివిధ కంపెనీలు తీసుకున్న రుణాలకు వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారు. ఆయన కార్యాలయం చెప్తున్న వివరాల ప్రకారం ఆయన నేరుగా అప్పు తీసుకోలేదు. ఆయన సంబంధించిన కొన్ని సంస్థలు తీసుకున్న అప్పులకు గ్యారంటర్ గా వున్నారు.

ఎస్సెల్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, ఎస్సెల్ ప్రొపాక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జీ మీడియా నెట్ వర్క్ కోసం సేకరించిన రుణాలకు వ్యక్తిగత పూచీకత్తుగా వున్నారు. ఇప్పుడా కంపెనీలు బ్యాంకులకు22 వేల కోట్లకు బకాయిలు పడ్డాయి. ఆ బకాయిలకు హామీదారుగా వున్నందుకు సుభాష్ చంద్ర ఆ మొత్తం చెల్లించాలి. వివాదం ఎన్సీఎల్టీ దగ్గర ఆరున్నర కోట్లకు పరిష్కారం అయింది. సుభాష్ చంద్ర ఆస్తుల విలువ ఆధారంగానే ఈ రీపేమెంట్ ప్లాన్ రూపొందించినట్టు చెప్తున్నారు.

ఆయన సొంత ఆస్తుల విలువ 6.5 కోట్ల కంటే తక్కువగా వున్నందున, ఈ ఆఫర్ ని తిరస్కరిస్తే బ్యాంకులకు రూపాయి కూడా దక్కే అవకాశం వుండదని ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే వంద రూపాయలకు 3 పైసల కంటే తక్కువగా బ్యాంకులకు చెల్లించేట్టు తీర్పు చెప్పారు. ఈ తీర్పు మీద దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది బ్యాంకులను ముంచే తీర్పని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ విమర్శించారు.

అప్పుల ఎగవేత కేసులో విదేశాల్లో వున్నవిజయ్ మాల్యా అయితే నేను చేసిన ఆరు వేల కోట్ల అప్పుకు 14 వేల కోట్లు వసూలు చేశారు. కానీ ఇక్కడ 22 వేల కోట్లకు 6 కోట్లతో పరిష్కారం లభించింది. ఇదొక గొప్ప సెటిల్మెంట్ అని పోస్ట్ చేశారు. అప్పులిచ్చిన ఎల్ ఐసి హౌసింగ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్ వంటి సంస్థలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 1322 కోట్ల బకాయి వుంటే కేవలం 38 లక్షలతో సెటిల్ చేశారు. వంద రూపాయలకు పైసా కంటే తక్కువగా చెల్లిస్తే చాలు.

సుభాష్ చంద్ర బిజెపి సానుభూతిపరుడిగా వుండటంతో విమర్శలు మరింత పదునెక్కుతున్నాయి. ఆయన 2016లో హర్యానా నుంచి బిజెపి మద్దతుతో ఇండిపెండెంట్ గా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2022లో కూడా బిజెపి మద్దతుతో రాజస్థాన్ నుంచి రాజ్యసభకుపోటీ చేసి ఓడిపోయారు. మన దేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయన్న విమర్శలు ఎంతో కాలంగా వున్నాయి. గతంలో అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, 86 వేల కోట్ల బకాయిలని 20 వేల కోట్లకు సెటిల్ చేశారు. విడియోకాన్ వేణుగోపాల్ థూత్ బకాయిలు 64 వేల కోట్లని 2,962 కోట్లకు సెటిల్ చేశారు.

పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా జరుగుతున్నఇలాంటి కారుచౌక సెటిల్మెంట్లు బ్యాంకింగ్ సంస్థల ఆయువు తీస్తున్నాయి. వీళ్లే కాదు, చాలా మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వందల కోట్లు అప్పులు చేసి, ఇన్ సాల్వెన్సీ పిటిషన్లు వెయ్యడం, వందకు రెండు మూడు రూపాయల్లెక్కన వన్ టైమ్ సెటిల్మెంట్లు చేసుకోవడం తరచుగా జరుగుతోంది. దీని వల్ల బ్యాంకింగ్ సంస్థలు నష్టపోతున్నాయి.

ఇవే బ్యాంకులు ఒక సామాన్యుడు ఇంటి రుణం తీసుకుని చెల్లించలేకపోతే ఇంటిని వేలం వేస్తాయి. టూవీలర్ లోన్ తీసుకుని ఒక కిస్తీ మిస్సయితే రోజుకు పదిసార్లు ఫోన్లు చేస్తారు. వసూళ్లకు ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టుకుని రుబాబు చేస్తారు. ఒక రైతు వ్యవసాయ రుణం తీసుకుని కరువు కారణంగానో, తుఫాన్లకారణంగానో పంటలు పండక రుణం చెల్లించలేకపోతే స్యూరిటీ పెట్టిన పొలం వేలం వేస్తారు. ఇళ్ల దగ్గరకొచ్చి ఒత్తిడి చేస్తుంటారు.

వ్యవసాయరుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నరైతులు ఈ దేశంలో కోకల్లలు. కానీ రుణ బకాయిలతో ఆత్మహత్యలు చేసుకున్న కార్పొరేట్లు ఒక్కరు కూడా కనబడరు. ఈ దేశంలో సామాన్యుడికొక న్యాయం, డబ్బున్నోడికొక న్యాయం అని వూరికే అనడం లేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే వ్యవస్థల్లో లోపాలు మనకు అర్ధమవుతుంటాయి. ఆ ప్రభుత్వం ఈ ఫ్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు వన్ టైమ్ సెటిల్మెంట్ల పేరుతో బ్యాంకుల ఆయువు తీస్తున్నారు.

ప్రజాధనానికి బాధ్యులెవరు? బ్యాంకులు భరించే ఈ 99.97% నష్టం చివరికి సామాన్య పౌరుల మీద ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది. చట్టపరంగా మెజారిటీ ఓటింగ్, ఎన్‌సిఎల్‌టి నిబంధనలు అన్నీ సరైనవే కావచ్చు. కానీ ప్రజలకు, ప్రభుత్వానికి జరుగుతున్న నష్టం కళ్లముందే కనిపిస్తుంటే చర్చించకుండా వుండలేం.

వ్యవస్థల వైఫల్యానికి, అధికారం దన్ను వుంటే ఏదైనా జరుగుతుందనడానికి ఇంకో ఉదాహరణ డేరా బాబా. ఈ డేరాబాబా అనే వ్యక్తి అసలు పేరు గుర్మీత్ సింగ్. డేరా సచ్చా సౌదా అనే ఆధ్యాత్మిక సంస్థకు అధిపతి. అన్ని మతాలు కలిసొచ్చేలా తన పేరుని గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అని మార్చుకున్నాడు. ఇతని మీద అనేక నేరాలకు సంబంధించిన ఆరోపణలున్నాయి.

ఆశ్రమంలో మహిళలపై కొన్నేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడ్డాడని, డేరాలో జరుగుతున్నఅక్రమాలు వెలికితీసిన విలేకరిని, మాజీ మేనేజర్ ని హత్య చేయించాడని, 400 మందిపురుష భక్తులకు కేస్ట్రేషన్ చేయించి నపుంసకులుగా మార్చాడన్న ఆరోపణలున్నాయి. ఇద్దరు సన్యాసినులపై అత్యాచారం చేసినకేసులో ఇతనికి పంజాబ్, హర్యానా హైకోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2017లో జైలుకెళ్లాడు. ఇప్పుడు

ఈ తొమ్మిదేళ్లలో 17 సార్లు పెరోల్ మీద బయటకొచ్చాడు. ఇతనికి వరుసగా పెరోల్స్ రావడం వెనుక రాజకీయ ప్రమేయం వుందన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇతనికిపెరోల్ వస్తుంది. ఇతనికి పంజాబ్, హర్యానా, రాజస్థాన్,పశ్చమ ఉత్తరప్రదేశ్ లో కోట్ల మంది అనుచరులుండటంవల్ల, రాజకీయజోక్యంతోనే అధికారులు పెరోల్ నిబంధనలు సడలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇతని మీద తీవ్రాతితీవ్రమైన నేరారోపణలున్నాయి.కొన్ని నేరాలు రుజువై శిక్ష పడినా కావాల్సినప్పుడు బయటకొచ్చే వెసులుబాటు కూడా వుంది.అధికారులు నిబంధనలప్రకారమే పెరోల్ ఇస్తున్నామని చెప్తారు. సామాన్య ఖైదీలకుకూడా ఇవే నిబంధనలు వర్తించాలి కదా. వాళ్లకు కూడా సంవత్సరానికి రెండుమూడుసార్లు పెరోళ్లు ఇవ్వాలి కదా? సామాన్యుల విషయంలో అది జరగదు.

ఈ దేశంలో వ్యవస్థలన్నీబలవంతులకు సాగిలపడతాయి. సామాన్యుడు వ్యవస్థలకు భయపడి బతుకుతుంటే, బలవంతులు వ్యవస్థలను చెరపట్టి తమ పాదాక్రాంతం చేసుకుంటారు. ఈ సంస్కృతికి చరమగీతం పాడే ప్రభుత్వాల కోసం,మంచి రోజుల కోసం ఎదురుచూపులతో మన జీవితాలు తెల్లారిపోతుంటాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments