ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక ‘నంది అవార్డులను’ పునరుద్ధరిస్తున్నట్లు చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త చర్చకు, తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినీ, టీవీ రంగానికి అవార్డులు ఇస్తామని ప్రకటించడం వెనుక.. అసలు ఏపీని దారుణంగా విస్మరించిన టాలీవుడ్ ప్రముఖులకు మన ప్రభుత్వ నిధులతో అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ఘాటైన ప్రశ్నలు సగటు ఆంధ్రుడి నుంచి వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా, నయా పైసా పెట్టుబడి పెట్టకుండా ఏపీని కేవలం ఒక ‘కలెక్షన్ల అడ్డా’గా మాత్రమే చూస్తున్న సినీ పరిశ్రమకు ఇంతటి పెద్ద పీట వేయాలా అనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకుల ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వాళ్లు సంపాదించే వందల కోట్ల ఆదాయానికి పన్నులు కూడా తెలంగాణ ప్రభుత్వానికే కడతారు. ఏపీ అభివృద్ధిలో గానీ, ఇక్కడి మౌలిక వసతుల కల్పనలో గానీ టాలీవుడ్ పాత్ర శూన్యం.
గతంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అక్కడి అధికార పీఠానికి జీ హుజూర్ అంటూ స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు అందరూ లైన్ కట్టి నిలబడి ‘హరితహారం’ వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొని ఫ్రీగా ప్రచారం చేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛాంధ్రప్రదేశ్ వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నా సరే.. టాలీవుడ్‌కు చెందిన ఏ ఒక్క పెద్ద స్టార్ హీరో కూడా ఇటువైపు తిరిగి చూడలేదు, కనీసం ఒక చిన్న ట్వీట్ లేదా ప్రచారం కూడా చేయలేదు.
వాళ్లకు ఏపీ గుర్తొచ్చేది కేవలం తమ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి, అదనపు షోలు వేసుకోవడానికి ప్రభుత్వాల దగ్గర పర్మిషన్లు అడగడానికి మాత్రమేననే విమర్శలు ఉన్నాయి. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుడు, స్టార్ హీరో అయిన పవన్ కల్యాణ్ స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, టాలీవుడ్ పెద్దలు ఏపీలో అడుగుపెట్టడానికి అస్సలు ఇష్టపడటం లేదు. పరిశ్రమను ఏపీకి తరలించడం దేవుడెరుగు, కనీసం వైజాగ్ వంటి నగరాల్లో చిన్న స్టూడియోలు కట్టడానికి లేదా షూటింగ్‌లు జరపడానికి కూడా ఆసక్తి చూపడం లేదు.
ఎప్పుడో ఒకసారి నాని, రామ్ పోతినేని వంటి ఒకరిద్దరు హీరోలు మాత్రమే అప్పుడప్పుడు ఏపీ గురించి మాట్లాడుతుంటారు తప్పించి.. మిగిలిన బడా హీరోలంతా ఇక్కడి భూములను, ఇక్కడి ప్రేక్షకులను కేవలం థియేటర్ల టికెట్ల రూపంలో పిండుకోవడానికే వాడుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్‌ను తమ సొంత రాష్ట్రంగా ఓన్ చేసుకోకుండా, ఇక్కడి అభివృద్ధిని వద్దు అనుకుంటున్న వాళ్లకు ఏపీ ప్రభుత్వం తన సొంత నిధులతో, ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డులను ఇచ్చి సత్కరించాల్సిన అవసరం ఏముందని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఏర్పడింది.














