పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణానికి మారుపేరైన కోనసీమ నేడు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ వద్ద జాతీయ రహదారి 216 పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ బావి నుంచి మంగళవారం తెల్లవారుజామున భారీగా గ్యాస్ లీక్ కావడం మరోసారి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఉదయం 5 గంటల సమయంలో బావి వద్ద మరమ్మతు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, వెంటనే వెల్-కంట్రోల్ చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ఓఎన్‌జీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, బావి చుట్టూ అరకిలోమీటర్ పరిధిలోని వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, విద్యుత్ సరఫరా నిలిపివేయడం, జాతీయ రహదారిపై వాహనాలను దారిమళ్లించడం చూస్తుంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం గ్యాస్ సాంద్రత సున్నాగా నమోదైందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నా, కోనసీమ ప్రజల మదిలో మాత్రం అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ బావులు, పైప్‌లైన్ల నుంచి గ్యాస్ లీక్ కావడం ఇది కనీసం నాలుగోసారి. ఈ ఏడాది జనవరిలో, ఆ తర్వాత అక్టోబర్‌లో ఇరుసుమండ సమీపంలోని మోరి-5 బావి వద్ద జరిగిన బ్లో అవుట్ ఘటనల తాలూకు భయానక దృశ్యాలను ప్రజలు మరువకముందే, ఇప్పుడు గెద్దాడ వద్ద మరో ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. 1995లో మామిడికుదురు మండలం పాశర్లపూడిలో 65 రోజుల పాటు ఆకాశాన్నంటే మంటలతో కోనసీమను వణికించిన భయానక బ్లో అవుట్ మొదలుకొని, 2001లో గోగుల్లంక, 2014లో నగరం వద్ద 22 మందిని బలిగొన్న గెయిల్ పైప్‌లైన్ పేలుడు, 2020లో కేశనపల్లి బ్లో అవుట్ వరకు ఈ ప్రాంతం ఎన్నో చీకటి రోజులను చూసింది. ఎప్పుడు ఏ బావి పేలుతుందో, ఏ పైప్‌లైన్ నుంచి విషవాయువులు వెలువడతాయో తెలియక స్థానికులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన దుస్థితి నెలకొంది.
అసలు ఇంతటి ఆధునిక సాంకేతిక యుగంలో కూడా ఓఎన్‌జీసీ సంస్థలో తరచూ ఇలాంటి లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయి? వీటికి శాశ్వత పరిష్కారం లేదా? అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో దశాబ్దాల క్రితం వేసిన పైప్‌లైన్లు, పాతబడిన బావులు తుప్పు పట్టి బలహీనపడటమే ఈ వరుస ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. రీ-డ్రిల్లింగ్ లేదా మరమ్మతు పనులు చేపట్టినప్పుడు భూగర్భంలో ఉండే అధిక పీడనాన్ని అంచనా వేయడంలో లోపాలు తలెత్తడం, పాత పైప్‌లైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడం వల్లే పదేపదే లీకేజీలు సంభవిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడల్లా నర్సాపూర్ నుంచి బృందాలను రప్పించడం, వాటర్ బ్లాంకెట్లు వేసి తాత్కాలికంగా మంటలు రాకుండా అడ్డుకోవడం తప్ప, అసలు లీకేజీలే జరగకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడంలో సంస్థ విఫలమవుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి సహజ వాయువును కోనసీమ గర్భం నుంచి వెలికితీస్తున్న సంస్థలు, ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు మరియు పర్యావరణానికి భద్రత కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం? కేవలం ప్రమాదం జరిగినప్పుడు అధికారిక ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా, కేజీ బేసిన్‌లోని అన్ని బావులు, పైప్‌లైన్లపై పూర్తిస్థాయి సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. తుప్పు పట్టిన పాత పైప్‌లైన్లను యుద్ధప్రాతిపదికన మార్చడం, ఆధునిక సెన్సార్ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం, నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉన్న బావుల వద్ద కట్టుదిట్టమైన రక్షణ కవచాలు నిర్మించడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అప్పటివరకు కోనసీమ వాసులకు ఈ గ్యాస్ గండం తప్పేలా కనిపించడం లేదు














