ప్రముఖ మూవీ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. సైబర్ క్రైమ్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా ఫ్రీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఖాతాలు సీజ్ కావడం వల్ల తన చేతిలో డబ్బులు లేక కుటుంబ పోషణకు, వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను విచారించిన నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, పోలీసులు సీజ్ చేసిన సదరు బ్యాంక్ అకౌంట్లను కేవలం రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని రవికి సాధారణ అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఖాతాల వినియోగానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. కేసుతో ముడిపడి ఉన్న అసలు నిధులకు మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు.
ఆయా బ్యాంక్ అకౌంట్లలో ప్రస్తుతం స్తంభించిపోయి ఉన్న రూ.3 కోట్ల భారీ నగదును మాత్రం అన్‌ఫ్రీజ్ చేయడానికి న్యాయస్థానం స్పష్టంగా నిరాకరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే కొనసాగుతున్నందున, ఆ నిధులను ఇప్పుడే విడుదల చేయడం కుదరదని స్పష్టం చేసింది. దీనివల్ల అకౌంట్ల లావాదేవీల పరంగా ఇమ్మడి రవికి కొంత సాంకేతిక ఉపశమనం లభించినప్పటికీ, కోట్లలో ఉన్న తన సొంత సొమ్మును వాడుకునేందుకు మాత్రం కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.














