బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఇన్నేళ్లు గడుస్తున్నా, ఆయన మృతికి సంబంధించిన వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మరోసారి తీవ్ర సంచలనం సృష్టించాయి. సుశాంత్‌కు పోస్ట్‌మార్టం నిర్వహించిన వ్యక్తి తమకు కొన్ని షాకింగ్ నిజాలు చెప్పాడని ఆమె పేర్కొంది. ఆ సమయంలో సుశాంత్ శరీరంపై బలాన్ని ప్రయోగించారని, అతని కళ్ళు దెబ్బతిన్నాయని, అంతేకాకుండా అతని కాలు విరగ్గొట్టడమే కాకుండా తుపాకీని కూడా ఉపయోగించారని సదరు వ్యక్తి తమకు వెల్లడించాడని శ్వేత తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో సంచలన ఆరోపణలు చేసింది.
తన సోదరుడికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ శ్వేత ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఒక్కోసారి మంచి వాళ్ళు కూడా తీవ్రమైన బాధలను అనుభవించాల్సి వస్తుందని, అయితే ఆ పెయిన్ మిమ్మల్ని మార్చడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించింది. మనకు అత్యంత ఇష్టమైన వారికి హాని జరిగినప్పుడు క్షమించడం చాలా కష్టమైన విషయమే అయినప్పటికీ, తాను మాత్రం ద్వేషం, ప్రతీకారం అనే భావనల్లో మునిగిపోవాలని అనుకోవడం లేదని చెప్పింది. ఈ లోకంలో ఎంత అన్యాయం ఉన్నా సరే, భగవంతుడిపై నమ్మకం ఉంచాలని, ద్వేషం కంటే ప్రేమే మనల్ని నయం చేస్తుందంటూ అభిమానులను కోరింది.
అయితే, శ్వేత చేసిన ఈ ఆరోపణలకు.. అధికారికంగా అందుబాటులో ఉన్న నివేదికలకు ఎక్కడా పొంతన లేదు. గతంలో కూపర్ హాస్పిటల్ ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, సుశాంత్ మరణం ఊపిరాడకపోవడం వల్లే జరిగిందని, అతని శరీరంపై ఎలాంటి ఫ్రాక్చర్లు, బుల్లెట్ గాయాలు లేదా కంటిపై దెబ్బలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు. ముంబై పోలీసులతో పాటు సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ లాంటి కేంద్ర సంస్థలు కూడా ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేశాయి. సీబీఐ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్‌లో సైతం ఇందులో ఎలాంటి ఫౌల్ ప్లే లేదని, ఇది పూర్తిగా ఆత్మహత్యేనని, హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది.












