రాజకీయాల్లో ఒక నాయకుడిపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. దానికి సజీవ సాక్ష్యం.. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఒకప్పుడు ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన బాడీ షేమింగ్, మాట్లాడటం రాదంటూ విపరీతమైన ట్రోలింగ్స్ ఎదుర్కొన్న అదే లోకేష్.. ఇప్పుడు దేశంలోనే మోస్ట్ సీనియర్ మరియు కఠినమైన జర్నలిస్టులుగా పేరుగాంచిన రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆర్నబ్ గోస్వామిల నుంచే సంచలన ప్రశంసలు అందుకుంటున్నారు.
‘ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్-2026’, ‘రిపబ్లిక్ టీవీ సమ్మిట్’ వేదికలపై లోకేష్ చూపిన పరిణతి, క్లారిటీ ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, గత 15 ఏళ్లుగా ఆయనపై జరిగిన నెగెటివ్ ప్రచారాన్ని ఒక్కసారిగా పటాపంచలు చేసింది. నారా లోకేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దాదాపు 15 ఏళ్ల కిందటి నుంచి.. రాజకీయ ప్రత్యర్ధులు ఆయనను టార్గెట్ చేస్తూ ఒక పక్కా వ్యూహంతో నెగెటివ్ బ్రాండింగ్ చేశాయి. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, కొన్ని సందర్భాల్లో తొందరపాటులో దొర్లిన తెలుగు పదాల తప్పులను పట్టుకుని సోషల్ మీడియాలో వందలాది మీమ్స్, ట్రోల్స్ సృష్టించారు.
“ఈయనకు మాట్లాడటం రాదు.. తండ్రి చంద్రాబాబు చాటు బిడ్డ.. లీడర్ కాలేడు, పప్పు” అంటూ ఉద్దేశపూర్వకంగా ముద్ర వేశారు. 2019 మంగళగిరి ఎన్నికల ఓటమి తర్వాత ఆ ట్రోలింగ్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఏ వేదికపై మాట్లాడినా తప్పులు వెతకడమే పనిగా పెట్టుకున్న ప్రత్యర్థులకు లోకేష్ సమాధానం చెప్పిన తీరు మాత్రం ఒక అద్భుతమైన రాజకీయ పాఠం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా లోకేష్ ఎక్కడా కుంగిపోలేదు, వెనకడుగు వేయలేదు. తనపై ఉన్న ‘ట్రోల్స్’ ముద్రను చెరిపేసేందుకు ఆయన ఎంచుకున్న ఏకైక మార్గం.. ప్రజల్లోకి వెళ్ళడం.
3,132 కిలోమీటర్ల మేర సాగిన ‘యువగళం’ పాదయాత్ర లోకేష్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఎండనక, వాననక వేలాది మంది ప్రజలతో కలిసి నడుస్తూ, మైక్ పట్టి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ప్రసంగాలు చేశారు. సామాన్యుల సమస్యలను నేరుగా వింటూ, తన వాగ్ధాటిని, తెలుగు భాషపై పట్టును పూర్తిగా మెరుగుపరుచుకుని.. తనను విమర్శించిన వారే ఆశ్చర్యపోయేలా సరికొత్త లీడర్‌గా ఎదిగారు. ఆ కష్టానికి ప్రతిఫలంగానే 2024 ఎన్నికల్లో మంగళగిరి నుండి భారీ మెజారిటీతో విజయం సాధించి, విమర్శకుల నోళ్లు నొక్కేశారు.
తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన ఇండియా టుడే సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ అడిగిన కఠినమైన ప్రశ్నలకు లోకేష్ ఎక్కడా తడబడకుండా, ఎంతో హుందాగా, సూటిగా సమాధానాలిచ్చారు. దీనిపై రాజ్‌దీప్ సర్దేశాయ్ ఎక్స్ లో స్పందిస్తూ సంచలన ట్వీట్ చేశారు. “ఏ ఒక్క ప్రశ్నను ముందే ఇవ్వమని అడగకుండా.. ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా, ఏ విషయాన్నైనా దాచకుండా ఓపెన్‌గా మాట్లాడే ఏకైక రాజకీయ నాయకుడు లోకేష్. ఒకప్పుడు రాజకీయాల్లో ఇది సాధారణ విషయం.. కానీ ఇప్పుడు ఇది ఒక అరుదైన విషయం. దేశంలోని ఇతర లీడర్లు కూడా లోకేష్‌ను చూసి నేర్చుకోవాలి” అంటూ కొనియాడారు. కేవలం రాజ్‌దీప్ మాత్రమే కాదు.. దేశంలోనే అత్యంత దూకుడుగా ఇంటర్వ్యూలు చేసే రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి కూడా లోకేష్ మేధస్సుకు, స్పష్టతకు ఫిదా అయ్యారు.
తమ సమ్మిట్‌లో లోకేష్ ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల ప్రణాళికలను ఇంగ్లీషులో ప్రెజెంట్ చేసిన తీరు చూసి.. “భారతదేశంలోనే అత్యంత నిశితంగా గమనించాల్సిన సెకండ్ జనరేషన్ లీడర్ నారా లోకేష్” అంటూ స్టేజ్ పైనే ప్రశంసలు కురిపించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన లోకేష్ నాలెడ్జ్, విజన్ ఇప్పుడు నేషనల్ మీడియాను సైతం ఆకర్షిస్తోంది. ఒక సామాన్య లీడర్‌కు, విజనరీ లీడర్‌కు ఉన్న తేడా ఇదే. నెగెటివిటీని చూసి భయపడి పారిపోకుండా, ఆ ట్రోల్స్‌నే తన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకున్నారు లోకేష్. 15 ఏళ్ల క్రితం ‘పప్పు’ అంటూ అవహేళన చేసిన వారే.. ఈరోజు ఆయనను ‘నెక్స్ట్ జనరేషన్ లీడర్’ గా ఒప్పుకునే స్థాయికి రావడం లోకేష్ సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం. ప్రశ్నలకు భయపడి జాతీయ మీడియా సదస్సులకు వెళ్లకుండా తప్పించుకునే నేతలున్న ఈ రోజుల్లో.. ముందస్తు స్క్రిప్ట్ లేకుండా కఠిన ప్రశ్నలను ఎదుర్కొన్న లోకేష్ ధైర్యం నిజంగా అభినందనీయం అంటున్నారు విమర్శకులు.














