ఎన్నికల వేళ కాంగ్రెస్ భారీ ప్రక్షాళన..!

0
11

మరో కొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ తమ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేసింది. దేశంలోనే రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా హాకీ దిగ్గజం పర్గాత్ సింగ్‌ను, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరాధనా మిశ్రా మోనాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు.

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నూతన సారథిగా బాధ్యతలు అందుకున్న ఆరాధనా మిశ్రా మోనా, యూపీలోని రాంపూర్ ఖాస్ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈమె రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ కుమార్తె. 2023 నుండి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ రాయ్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరాధనా మిశ్రా కుటుంబానికి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో మంచి సత్సంబంధాలు ఉండటంతో, రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి బలోపేతానికి ఈ నియామకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ శ్రేణులు స్వాగతించాయి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగం, ఈసీ నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ లోపాలు, శాంతిభద్రతల వైఫల్యాలపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఆరాధనా మిశ్రాతో పాటు యూపీ కాంగ్రెస్‌లో మరికొన్ని ప్రధాన నియామకాలు జరిగాయి‌. లోక్‌సభ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, దేవేంద్ర నిషాద్, ఆలోక్ ప్రసాద్‌లను వైస్ ప్రెసిడెంట్లుగా నియమించారు‌. అలాగే ఉత్తరప్రదేశ్ శాసనసభ కాంగ్రెస్ పక్ష నేతగా చౌదరి వీరేంద్ర సింగ్‌ను ఎంపిక చేశారు‌.

మరోవైపు, అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న పంజాబ్ కాంగ్రెస్ విభాగానికి సరికొత్త జవసత్వాలు నింపేందుకు హాకీ మాజీ కెప్టెన్ పర్గాత్ సింగ్‌ను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు‌. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో విభేదాల కారణంగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో పర్గాత్ సింగ్‌కు ఈ బాధ్యతలు దక్కాయి‌. పంజాబ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన జాట్ సిక్కు సామాజికవర్గానికి చెందిన పర్గాత్ సింగ్, పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేస్తారనే నమ్మకంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది‌. రాబోయే సార్వత్రిక పోరుకు ముందే కాంగ్రెస్ రెండు పెద్ద రాష్ట్రాలలో కొత్త నాయకత్వాన్ని రంగంలోకి దించడంతో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.