అర్ధరాత్రి భయపడుతున్న బెజవాడ, సీఎం మాటలకే లెక్క లేదా..?

0
5

గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. గంజాయి బ్యాచ్ కనపడితే అది చివరి రోజు, గంజాయి అమ్మినా వాడినా కఠిన చర్యలు.. ఈ డైలాగులు గత రెండేళ్ళ నుంచి ప్రతీ ఒక్కరు వినే ఉంటారు. కానీ కానీ.. గ్రౌండ్ లో సీన్ తేడాగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు, నిత్యం పోలీస్ నిఘా నీడన ఉండే విజయవాడ నగరంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో చెప్పడానికి తాజా ఘటనే ఒక సజీవ సాక్ష్యం. సమాజంలో మహిళల రక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమించే ఒక మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ కుటుంబానికే నడిరోడ్డుపై రక్షణ లేకుండా పోయింది.

అర్ధరాత్రి వేళ విధుల్లో ఉన్న ఎస్సై ప్రమీల కారును ఇద్దరు యువకులు గంజాయి, మద్యం మత్తులో వెంబడించి వేధించడం బెజవాడ నగర భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిందితులు గొల్లపూడికి చెందిన భరద్వాజ, మణిదీప్‌లుగా గుర్తించి.. వారు పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ.. ఈ ఘటన సృష్టించిన భయాందోళనలు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఒక ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మహిళా అధికారిణికే ఈ దుస్థితి పడితే.. ఇక నగరంలో సామాన్య మహిళల, కుటుంబాల పరిస్థితి ఏంటనేది మింగుడుపడని నిజం.

“రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతాం.. బెజవాడను బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి ముఠాలు లేని నగరంగా మారుస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అటు రక్షణ శాఖ పెద్దలు మైకుల ముందు పదే పదే గంభీరమైన ప్రసంగాలు ఇస్తుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే పాలకులు చెప్తున్న మాటలకు, జరుగుతున్న చేతలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. నగరంలో ఒకే బైక్ మీద ముగ్గురు కూర్చోవడం, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా నలుగురు కూర్చుని అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై రేసింగ్‌లు చేయడం నిత్యకృత్యంగా మారింది. అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలో ఒక సామాన్య మగాడు తన ఫ్యామిలీతో కలిసి ధైర్యంగా రోడ్డు మీదకు రాలేని భయానక వాతావరణం నెలకొంది.

నగరంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్‌లు పాగా వేసి కూర్చున్నాయి. గాంధీ నగర్, సత్యనారాయణ పురం, సింగ్ నగర్, ఆటో నగర్, పటమట లంక, పటమట, కృష్ణ లంక, రాణీ గారి తోట.. ఇలా ఏ ఒక్క ప్రాంతాన్ని చూసినా చీకటి పడితే చాలు గంజాయి ఘాటు ఊపిరాడకుండా చేస్తోంది. కాలేజీ విద్యార్థుల నుంచి మొదలుకొని వీధి రౌడీల వరకు ఈ వ్యసనానికి బానిసలై ల్యాండ్ మార్క్‌లుగా మారిన జంక్షన్లలో తిష్ట వేస్తున్నారు. పోలీసులు నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టుకుంటున్నారే తప్ప, ఈ క్యాన్సర్ లాంటి మహమ్మారిని మూలాల నుండి నిర్మూలించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. పెట్రోల్ బంకుల్లో పని చేసే సిబ్బంది సైతం వీరికి భయపడే పరిస్థితి ఏర్పడింది.

వీధుల వెంబడి ఉన్న సీసీ కెమెరాలు, రాత్రి గస్తీ తిరిగే పోలీస్ వాహనాలు కేవలం అలంకారప్రాయంగానే మిగిలిపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవస్థ ఇంతలా భ్రష్టుపట్టిపోవడానికి ప్రధాన కారణం పోలీస్ స్టేషన్లపై నడుస్తున్న రాజకీయ ఒత్తిళ్లే. నగరంలో ఏదైనా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగి గొడవలు చేసే ఆకతాయిలను లేదా ట్రిపుల్ రైడింగ్స్ చేస్తూ దొరికిన రౌడీ మూకలను పోలీసులు అదుపులోకి తీసుకుంటే.. మరుసటి క్షణమే స్థానిక రాజకీయ నాయకుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో, లేదా తమ అనుచరులనే అహంకారంతోనో సదరు నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నిందితులను రిఫరెన్సులతో బయటకు లాగేస్తున్నారు.

దీంతో పోలీసులు సైతం కేసు నమోదు చేయలేక, వారిని వెనక్కి పంపేస్తూ మిన్నకుండిపోతున్నారు. రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో ఆకతాయిలకు చట్టం అన్నా, పోలీసులు అన్నా కనీస భయం లేకుండా పోయింది. ఫలితంగా నేరస్థులు యథేచ్ఛగా తిరుగుతుంటే, చట్టాన్ని అమలు చేయాల్సిన ఖాకీల చేతులు రాజకీయ బేడీలతో కట్టిపడేసినట్లయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రసంగాల స్థాయి దాటి, పొలిటికల్ రిఫరెన్సులను పక్కన పెట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే.. బెజవాడ నగరం నేరగాళ్లకు అడ్డాగా మారడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.