29 C
Vijayawada
Monday, November 23, 2026
Home ఆంధ్రప్రదేశ్ ఏపీలో మరో భారీ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!

ఏపీలో మరో భారీ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!

0
2

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే (SCoR) మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు (వయా సామర్లకోట) 3, 4వ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ల నిర్మాణానికి అక్షరాలా రూ.4,299.12 కోట్ల విలువైన ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ టెండర్లను ఆహ్వానించింది. విజయవాడ, విశాఖపట్నం రైల్వే డివిజన్ల పరిధిలో 608.600 కిలోమీటర్ల చైనేజీ నుంచి 759.680 కిలోమీటర్ల వరకు, మొత్తం 151.08 కిలోమీటర్ల మేర ఈ కొత్త ట్రాక్‌లను నిర్మించనున్నారు.

ఈ టెండర్ల దాఖలుకు 2027 ఫిబ్రవరి 15 వరకు గడువు విధించగా, రూ.85.98 కోట్లను ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD)గా నిర్ణయించారు. నిడదవోలు-దువ్వాడ మధ్య రూ.9,889 కోట్లతో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 198 కిలోమీటర్ల ప్రతిష్ఠాత్మక క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల) ప్రాజెక్టులో భాగంగా ఈ పనులను చేపట్టారు. ఈ భారీ ప్యాకేజీలో కేవలం రైల్వే ట్రాక్‌ల నిర్మాణమే కాకుండా భారీ వంతెనలు, సివిల్ పనులు, విద్యుదీకరణ, ఆధునిక సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలతో పాటు దేశీయ రైలు ప్రమాద నివారణ వ్యవస్థ ‘కవచ్’ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

అంతేకాకుండా, ప్రధాన స్టేషన్లలో రద్దీని నివారించేందుకు తుని, అనకాపల్లి రైల్వే స్టేషన్లకు ప్రత్యేక బైపాస్ లైన్లను నిర్మించడంతో పాటు అనకాపల్లి-కొత్తవలస కొత్త బ్రాడ్ గేజ్ లైన్‌కు నేరుగా అనుసంధానం కల్పించనున్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే హౌరా-చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంలో ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది. అదనపు రైల్వే లైన్లు అందుబాటులోకి రావడం వల్ల ఎక్స్‌ప్రెస్, ప్రయాణికుల రైళ్లు క్రాసింగ్‌ల కోసం ఆగాల్సిన అవసరం లేకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి. అలాగే విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు ఏటా అదనంగా దాదాపు 29 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యం పెరగనుంది. కోస్తాంధ్ర ప్రాంత పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి ఈ రైల్వే ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.