ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కనుమూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికంగా పెను కలకలం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ పులుల జాడ లేని ప్రాంతాలకు సైతం ఇప్పుడు వందల కిలోమీటర్లు ప్రయాణించి మరీ పెద్దపులులు వస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి బయలుదేరి తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల మీదుగా పాపికొండలు దాటి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల వరకు ఒక పులి రావడం వెనుక బలమైన శాస్త్రీయ, పర్యావరణ కారణాలు ఉన్నాయని వన్యప్రాణి నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారతదేశంలో గత కొన్నేళ్లుగా చేపడుతున్న సంరక్షణ చర్యల వల్ల పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని తడోబా, ఛత్తీస్గఢ్, తెలంగాణ అటవీ ప్రాంతాల్లో పులుల సంతతి వృద్ధి చెందింది. అయితే ఒక మగపులికి కనీసం 50 నుంచి 100 చదరపు కిలోమీటర్ల సొంత ఆవాస ప్రాంతం (టెరిటరీ) అవసరం ఉంటుంది. అడవిలో పులుల సంఖ్య పెరిగినప్పుడు, బలమైన పెద్ద పులులు తమ ప్రాంతంలోకి ఇతర మగపులులను రానివ్వవు. దీంతో ఆధిపత్య పోరులో భాగంగా యువ మగపులులు తమ సొంత ప్రాంతాన్ని, తోడును వెతుక్కుంటూ కొత్త అడవుల వైపు సుదీర్ఘ ప్రయాణాలు మొదలుపెడతాయి.
ఇలా కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ బయలుదేరే క్రమంలో పులులు తమ పురాతన వలస మార్గాలను అంటే టైగర్ కారిడార్లను అనుసరిస్తాయి. అయితే అడవుల విస్తీర్ణం తగ్గడం, రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఆ కారిడార్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా అడవి మార్గం తప్పి, పంట పొలాలు, చిన్నపాటి కొండలు, వాగుల వెంట ప్రయాణిస్తూ ఇవి జనావాసాలకు సమీపంలోకి వచ్చేస్తున్నాయి. దీనికి తోడు అడవిలో వేటాడేందుకు సరిపడా జింకలు, అడవి పందుల వంటి ఆహార జంతువులు తగ్గిపోవడం కూడా పులులు బయటకు రావడానికి మరో ప్రధాన కారణం.
పంట పొలాల్లోకి వచ్చినప్పుడు అక్కడ మేతకు వెళ్లే పశువులు, మేకలు సులభంగా ఆహారంగా దొరుకుతుండటంతో పులులు ఆ ప్రాంతాల్లోనే కొద్దిరోజులు తిష్ట వేస్తున్నాయి. శీతాకాలం, వర్షాకాలం ముగిసే సమయం పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో, తోడు కోసం కూడా ఇవి వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. అంటే పులులు జనావాసాల్లోకి రావడం వెనుక వాటి స్వభావంలో మార్పు కంటే, అడవుల్లో స్థలం, ఆహారం తగ్గిపోవడమే అసలు కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.














