ఇండియాకు బిగ్ అలర్ట్.. కరిగిపోతున్న భారత్ ఫారెక్స్ నిల్వలు..!

0
4

భారతదేశ ఆర్థిక రక్షణ కవచంగా భావించే విదేశీ మారక నిల్వలకు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు గట్టి షాక్ ఇచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. కేవలం ఒకే వారంలో భారత ఫారెక్స్ నిల్వలు ఏకంగా 18.34 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 1.53 లక్షల కోట్లు పడిపోయి, 747.56 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశ ఆర్థిక చరిత్రలోనే ఇది అత్యంత భారీ వారంతపు పతనంగా నమోదైంది. కేవలం మూడు వారాల క్రితం 785.71 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ రికార్డు గరిష్టాన్ని తాకిన నిల్వలు.. ప్రస్తుతం ఏకంగా 38.15 బిలియన్ డాలర్లను కోల్పోవడం ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఫారెక్స్ నిల్వల్లో వచ్చిన ఈ మార్పు కేవలం ఒక సాధారణ సంఖ్య కాదు, ఇది భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అంతర్గత, బాహ్య ఒత్తిళ్లకు ఒక పెద్ద హెచ్చరిక సంకేతం. సాధారణంగా ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోరు కానీ, అవి కరిగిపోతున్నప్పుడే పాలసీ మేకర్లకు అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఈ పతనానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్తున్నారు నిపుణులు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ల ఈల్డ్స్ హెచ్చడం వల్ల భారత కరెన్సీ రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రూపాయి విలువ మరీ దారుణంగా పడిపోకుండా అడ్డుకునేందుకు ఆర్‌బీఐ తన వద్ద ఉన్న డాలర్లను ఓపెన్ మార్కెట్లో భారీగా విక్రయించాల్సి వచ్చింది. రెండవది భారత ఫారెక్స్ నిల్వలలో కేవలం డాలర్లే కాకుండా యూరో, యెన్, పౌండ్ వంటి ఇతర అంతర్జాతీయ కరెన్సీలు, అలాగే భారీగా బంగారం నిల్వలు ఉంటాయి. ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల వల్ల డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీల విలువ బలహీనపడటం, బంగారం ధరల్లో మార్పుల వల్ల వాల్యుయేషన్ పరంగా కూడా విలువ క్షీణించింది.

భారతదేశానికి ఎప్పుడూ ఉండే అతిపెద్ద బలహీనత ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు. ముడిచమురు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ఎరువుల దిగుమతుల కోసం భారత్ భారీగా డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ధరలు పెరిగినా సరే వీటి దిగుమతులను మనం ఆపలేము. గతంలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, ప్రవాస భారతీయుల ద్వారా వచ్చే డాలర్లు ఈ లోటును భర్తీ చేసేవి. కానీ ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో టెక్నాలజీ ఖర్చులు తగ్గడం, గ్లోబల్ లేబర్ మార్కెట్ మందగించడం వల్ల ఆ బఫర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారత స్టాక్ మార్కెట్ నుండి వెనక్కి తీసుకుంటుండటం వల్ల డాలర్లకు డిమాండ్ మరింత పెరిగింది. నిల్వలు ఉన్నందువల్ల ఆర్‌బీఐ ప్రస్తుతానికి ఈ షాక్‌ను తట్టుకోగలుగుతున్నప్పటికీ, ఈ అంతర్జాతీయ ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉందని, కాబట్టి దేశీయ ఆర్థిక విధానాలను మరింత పటిష్టం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.