కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కేటాయింపు వ్యవహారంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సోదరుడి కుమారుడికి జెడ్పీ ఛైర్మన్ పదవి దక్కలేదన్న కారణంతో ఆయన రాజీనామాల హెచ్చరికలు చేయడం, బహిరంగంగా విమర్శలు గుప్పించడంపై సీఎం ఘాటుగా స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పదవుల కోసం అలకలు బూనడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు.
కూటమిలో సీట్ల సర్దుబాటు, పదవుల పంపకం జరిగినప్పుడు అన్ని ప్రాంతాలను, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. జెడ్పీ ఛైర్మన్ పదవి దక్కలేదని అలిగితే ఎలా అని ప్రశ్నించిన ఆయన, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడమే ఒక నిజమైన నాయకుడి బాధ్యత అని గుర్తుచేశారు. అలిగిన నేతలకు తొలుత నచ్చజెప్పి కౌన్సెలింగ్ ఇస్తామని, అయినప్పటికీ వినకుండా మొండిగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించక తప్పదని ముఖ్యమంత్రి గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు, శుక్రవారం రాత్రి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి ఆదినారాయణ రెడ్డి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పొత్తు ధర్మంలో భాగంగానే కడప జెడ్పీ స్థానాన్ని టీడీపీకి కేటాయించాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. అయినప్పటికీ శనివారం ఉదయం ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం పెట్టి తన అసంతృప్తిని కొనసాగిస్తూ ఢిల్లీ వెళ్తానని ప్రకటించడంతో, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.














