రాహుల్ గాంధీని తక్కువ అంచనా వేశారా..?

0
8

ఢిల్లీ వేదికగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో విపక్షాలు చేస్తున్న ఆందోళనలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ నిరసనల వెనుక ఉన్న వ్యూహాన్ని గమనిస్తే, కేంద్ర పెద్దలు.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తీవ్రంగా తక్కువ అంచనా వేశారా..? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు అగ్రనేతలపై పోలీసులు నిర్బంధాలు విధించి, విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై కేసులు నమోదు చేసినప్పటికీ, కాంగ్రెస్ శ్రేణులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కేంద్రానికి ఊహించని షాక్ ఇచ్చింది.

అమెరికా పౌరసత్వ వెరిఫికేషన్ వివాదంలో డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా భారత సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేరును ప్రస్తావించడాన్ని రాహుల్ గాంధీ అత్యంత వేగంగా తన పొలిటికల్ అస్త్రంగా మార్చుకున్నారు. గతంలో రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో లేదా బయట నిరసనలు చేస్తే కొద్దిరోజుల్లోనే అవి చల్లారిపోతాయని అధికార పక్షం భావించేది. కానీ ఈసారి సీఈసీ ఇష్యూని నేరుగా ప్రజాస్వామ్య రక్షణతో ముడిపెట్టి, వీధికెక్కడం ద్వారా రాహుల్ తన సరికొత్త దూకుడును ప్రదర్శించారు. ఈరోజు మరింత పెద్ద ఎత్తున విపక్ష ఎంపీలను రంగంలోకి దించి ఢిల్లీ వీధులను స్తంభింపజేయాలని నిర్ణయించడంతో, కాంగ్రెస్ నిరసనలు అంత తేలిగ్గా ఆగే అవకాశం లేదని స్పష్టమైంది.

ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు అత్యంత నమ్మకమైన అధికారిగా పేరున్న జ్ఞానేష్ కుమార్‌ను టార్గెట్ చేయడం ద్వారా రాహుల్ గాంధీ కేంద్రానికి ఒక పెద్ద సందిగ్ధతను సృష్టించారు. ఒకవేళ విపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఆయనతో రాజీనామా చేయిస్తే.. అది రాహుల్ గాంధీ పోరాటానికి లభించిన చారిత్రాత్మక విజయంగా నిలుస్తుంది, అలాగే ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది. ఒకవేళ రాజీనామా చేయించకుండా కాపాడుకుంటూ వస్తే.. “తమకు నమ్మకమైన అధికారి కాబట్టే కేంద్రం రక్షిస్తోంది” అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి రాహుల్‌కు అవకాశం దొరుకుతుంది. ఈ విధంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా నష్టపోయేలా రాహుల్ గాంధీ వేసిన వ్యూహం, ఆయన లీడర్‌షిప్‌ను తక్కువ అంచనా వేసిన వారికి గట్టి సమాధానంగా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.