ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగా రా మోగుతున్న తరుణంలో.. వైఎస్సార్ కడప జిల్లా రాజకీయం అత్యంత సంచలన మలుపులు తిరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కడప, పులివెందుల నియోజకవర్గాలు సొంత కోట లాంటివి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ సొంత గడ్డపైనే ఉనికిని కాపాడుకోవడం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా వైసీపీ రాజకీయాల్లో ఒక ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది.
జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి నేరుగా క్షేత్రస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, జిల్లా బాధ్యతలను భుజాన వేసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహార శైలిపై కడప, పులివెందుల పరిధిలోని ద్వితీయ శ్రేణి నాయకులు, స్థానిక క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు ముమ్మరం కావడం, మరోవైపు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో అవినాష్ రెడ్డి గ్రాఫ్ తగ్గుతోందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలినట్లు సమాచారం.
సొంత జిల్లాలోనే అవినాష్ రెడ్డిపై ఉన్న ఈ యాంటీ-ఇన్‌కంబెన్సీ రాబోయే మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని జగన్ మోహన్ రెడ్డి గట్టిగా భయపడుతున్నట్లు టాక్. ఈ వ్యతిరేకతను ఇలాగే వదిలేస్తే కూటమి పార్టీలు కడప పీఠాన్ని కైవసం చేసుకునే ప్రమాదం ఉందని అధిష్టానం అలర్ట్ అయింది. అవినాష్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను బ్రేక్ చేయడానికి, పార్టీ నేతల్లో నూతనోత్సాహం నింపడానికి జగన్ మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ భారతీ రెడ్డిని కడప, పులివెందుల స్థానిక ఎన్నికల బాధ్యతల్లోకి దించారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థితో పాటు, జిల్లా పరిధిలోని వివిధ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వైఎస్ భారతి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. పులివెందులలోని స్థానిక లీడర్లతో, ఇంచార్జులతో ఆమె వరుసగా అంతర్గత సమావేశాలు జరుపుతూ.. అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కుటుంబంలో భారతీ రెడ్డికి స్థానిక క్యాడర్‌లో మంచి గౌరవం ఉంది.
ఆమె స్వయంగా రంగంలోకి దిగడం వల్ల అసంతృప్తితో ఉన్న నేతలు సద్దుమనుగుతారని, గ్రూపు తగాదాలకు చెక్ పడుతుందని వైసీపీ భావిస్తోంది. అవినాష్ రెడ్డిని కాస్త పక్కన పెట్టి, భారతీ రెడ్డి ఇమేజ్‌తో స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు కూటమి పార్టీలు కడప జిల్లాను ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని పక్కా స్కెచ్ వేస్తుంటే.. వైఎస్ భారతి ఎంట్రీతో సొంత కోటను జగన్ కాపాడుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌లో బిగ్గెస్ట్ మిస్టరీగా మారింది.














