మార్కెట్‌లో బియ్యం కొరత ఎఫెక్ట్.. కోతకు ముందే వరి కొనుగోళ్లు..!

0
7

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత సీజన్‌లో వరి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం, మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సరికొత్త పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత మద్దతు ధర కోసం రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల చుట్టూ, రైస్ మిల్లుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుత మార్కెట్ కొరత నేపథ్యంలో.. వ్యాపారులే నేరుగా రైతుల వరి పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు.

పంట ఇంకా కోత దశకు రాకముందే, కేవలం కంకి దశలోనే ఉన్నప్పుడే వ్యాపారులు రైతుల వద్దకు వచ్చి ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే దాదాపు రెట్టింపు ధర ఇచ్చేందుకు సైతం వ్యాపారులు వెనకాడటం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్ దృష్ట్యా క్వింటా వరికి ఏకంగా రూ. 4600 వరకు చెల్లించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఈ పోటీలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాపారులతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కూడా భారీగా రంగంలోకి దిగారు.

హైదరాబాద్ శివారు గ్రామాలతో పాటు తెలంగాణ పల్లెల్లో వ్యాపారులు విస్తృతంగా తిరుగుతూ రైతులను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్ల అమ్మకాల సమయంలో తరుగు, తేమ శాతం, తాలు గింజల పేరుతో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారులు ఈ నిబంధనలేవీ పట్టించుకోబోమని, పంట ఎలా ఉన్నా కోత కోసిన వెంటనే నేరుగా కొనుగోలు చేస్తామని రైతులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. పంట దిగుబడి తగ్గి మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా ఉండటమే ఈ ముందస్తు పోటీకి ప్రధాన కారణం. గతంలో మద్దతు ధరకు కూడా ధాన్యాన్ని కొనేవారు కరువవ్వగా.. ఇప్పుడు డిమాండ్ పెరగడంతో కంకి దశలోనే వ్యాపారులు పొలాల వద్ద క్యూ కట్టడం అన్నదాతలకు కలిసివచ్చే అంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.