రజనీకాంత్‌కే కండీషన్ పెట్టిన మిథున్ చక్రవర్తి..!

0
5

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ జైలర్ 2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్‌లో బాలీవుడ్ దిగ్గజ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మిథున్ చక్రవర్తి విలన్ పాత్ర పోషిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, మిథున్ చక్రవర్తి కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇటీవల జరిగిన ‘జైలర్ 2 సూపర్‌ షో’ ఈవెంట్‌లో మిథున్ చక్రవర్తి ఈ పాత్రను ఒప్పుకోవడం వెనుక ఉన్న ఒక ఫన్నీ సీక్రెట్‌ను రజనీకాంత్ స్వయంగా పంచుకున్నారు.

రజనీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జైలర్ 2 ప్రొడక్షన్ టీమ్ మొదట విలన్ పాత్ర కోసం మిథున్ చక్రవర్తిని సంప్రదించినప్పుడు ఆయన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. “నేను రజనీకాంత్ సినిమాలో విలనా? ఆయన చేతిలో తన్నులు తినాలా? నా వల్ల కాదు బాబోయ్, వెళ్ళిపోండి” అంటూ ప్రొడక్షన్ టీమ్‌తో మిథున్ సరదాగా అన్నట్లు రజనీ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ఒక సమ్మిట్ వేదికగా రజనీకాంత్ స్వయంగా మిథున్‌ను కలిసి మాట్లాడినప్పుడు.. “నువ్వు చెబితే నేను ఈ సినిమా ఖచ్చితంగా చేస్తాను.. కానీ నాకు ఒకే ఒక్క కండీషన్.. సినిమాలో నీ క్యారెక్టర్ నన్ను కొట్టకూడదు, అలాగే కాల్చకూడదు” అని మిథున్ నవ్వుతూ కండీషన్ పెట్టారట.

డైరెక్టర్‌ను అడిగి చెబుతానని రజనీకాంత్ అప్పట్లో సమాధానమిచ్చినప్పటికీ, మిథున్ చక్రవర్తి కేవలం సరదాకే ఆ కండీషన్ పెట్టారని తెలుస్తోంది. ఏదేమైనా రజనీకాంత్, మిథున్ చక్రవర్తి, మరియు మోహన్‌లాల్ లాంటి ముగ్గురు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రమ్యకృష్ణన్, యోగి బాబు, విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.