మేయర్ గా పోటీ చేస్తావా..? ఎమ్మెల్యే సీటు గ్యారెంటీ..!

0
4

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో వ్యూహప్రతివ్యూహాలు ముమ్మరమయ్యాయి. అయితే, ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ఈ ఎన్నికలు జరుగుతుండటంతో.. పోటీ చేసేందుకు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కీలక నేతలు సైతం తీవ్రంగా వెనకడుగు వేస్తున్నారు.

ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మేయర్ స్థానానికి పోటీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. డివిజన్ల వారీగా అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ, ఓటర్లను ఆకట్టుకోవడానికి కోట్లాది రూపాయల నిధులు నీళ్లలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కూటమి పార్టీలు అధికార బలంతో, ఆర్థిక అంగబలంతో బరిలోకి దిగుతుండటంతో.. వారిని ఢీకొట్టడం అంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని కొనితెచ్చుకోవడమేనని వైసీపీ ఆశావాహులు భావిస్తున్నారు. ఓటమి భయం ఒకవైపు వెంటాడుతుంటే.. మరోవైపు అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వనరులను ఈ ఎన్నికల్లో తగలేయడం అవసరమా..? అంటూ చాలా మంది సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ సైలెంట్ అయిపోతున్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, క్యాడర్‌లో నైతిక స్థైర్యాన్ని నింపడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సరికొత్త పొలిటికల్ గ్యాంబ్లింగ్‌ను తెరపైకి తెచ్చినట్లు తాజా సమాచారం. సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ ఆశించే నేతలకు జగన్ గట్టి షాకే ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అధిష్టానం తరఫున ఎలాంటి ఆర్థిక సాయం లేదా ఎన్నికల ఫండ్స్ అందించే ప్రసక్తే లేదని ఆయన ముందే క్లియర్ కట్‌గా తేల్చి చెప్పేసినట్లు పార్టీ అంతర్గత వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది.

అయితే, రూపాయి ఆర్థిక సాయం చేయకపోయినా.. నేతలను ఎన్నికల బరిలోకి దించేందుకు జగన్ ఒక బంపర్ ఆఫర్‌ను ఎరగా వేశారు. ప్రస్తుతం ఏ ఏ నియోజకవర్గాల పరిధిలో అయితే మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయో.. అక్కడ సొంత ఖర్చులతో మేయర్ అభ్యర్థులుగా నిలబడి, ధైర్యంగా కూటమిని ఎదుర్కొనే నేతలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తానని జగన్ ఓపెన్ హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

“ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేషన్ నిలబెడితే.. రేపు అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మీకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది” అంటూ జగన్ నేతలకు కండిషన్ పెడుతున్నట్లు సమాచారం. రాబోయే ఎమ్మెల్యే సీటును ఆశ చూపించి, ప్రస్తుతానికి పార్టీపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అభ్యర్థులను దొరకబట్టాలనేది జగన్ మాస్టర్ ప్లాన్. అయితే, జగన్ ఇచ్చిన ఈ నయా ఆఫర్‌పై వైసీపీ లీడర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉందని, అప్పటివరకు రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో తెలియని పరిస్థితిలో.. ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్..? అని కొందరు నేతలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. జగన్ ఆడిన ఈ మైండ్ గేమ్ కూటమి చక్రవ్యూహాన్ని ఛేదించి వైసీపీకి అభ్యర్థులను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.