ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ముంగిట రాజకీయ పార్టీలన్నీ సర్వసన్నద్ధమవుతుంటే.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు నేడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారిస్తుండటంతో బెజవాడ రాజకీయాల కంటే ఢిల్లీ, హైదరాబాద్ పరిణామాలపైనే వైసీపీ అధిష్టానం ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రాధాన్యతలపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో సరికొత్త చర్చ మొదలైంది.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు సాధారణంగా అధినేత నేరుగా రంగంలోకి దిగాలి. కానీ, జగన్ మాత్రం క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు, ప్రచార పర్యవేక్షణ వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను పూర్తిగా రీజనల్ కోఆర్డినేటర్ల భుజాలపై పెట్టేశారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులే స్థానికంగా అన్ని వ్యవహారాలు చూసుకోవాలని స్పష్టం చేసిన జగన్.. తాను మాత్రం తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొద్దిరోజులుగా ఇతర అంశాలపై బిజీగా మారడం గమనార్హం.
వివేకా హత్య కేసులో రూ. 40 కోట్ల సుపారీ లావాదేవీలపై లభించిన కొన్ని కీలక ఆధారాలతో ఈడీ ఉచ్చు బిగిస్తోందని, వచ్చే వారం నుంచి అరెస్టులు కూడా ఉండొచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది. ఈ క్రమంలోనే, తన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ సంక్షోభం నుంచి ఎలాగైనా గట్టెక్కించాలనే ఏకైక లక్ష్యంతో జగన్ ప్రస్తుతం వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు జగన్ ఢిల్లీ పర్యటనకు కూడా సిద్దమయ్యారు అనే వార్తలు సైతం వినపడుతున్నాయి. ఢిల్లీ టూర్ లో అవినాష్ రెడ్డికి చట్టపరమైన, రాజకీయ రక్షణ కల్పించే ప్రయత్నాలే ఉన్నాయనే మాట వినపడుతోంది. స్థానిక ఎన్నికల కంటే తన తమ్ముడు అవినాష్ రెడ్డిని ఈడీ ఉచ్చు నుంచి కాపాడుకోవడమే ప్రస్తుతానికి జగన్ ప్రథమ ప్రాధాన్యతగా మారిందని, అందుకే ఆయన పార్టీ పగ్గాలను రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించి బ్యాక్ సీట్లోకి వెళ్లారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












