పరిటాల శ్రీరామ్ వర్సెస్ గంగుల భానుమతి..?

0
7

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ముంగిట ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మున్సిపల్, జడ్పీ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేయడంతో ఆయా పదవులను ఆశిస్తున్న నేతల జాబితా లీకవుతోంది. ఈ రేసులో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉంటూ, అసెంబ్లీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన సీనియర్ నాయకురాలు గంగుల భానుమతి పేరు ఇప్పుడు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది.

గంగుల భానుమతి గత కొన్ని ఎన్నికల నుంచి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే, పార్టీలో ఉన్న సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, పొత్తుల లెక్కల కారణంగా ఆమెకు అసెంబ్లీ టికెట్ దక్కలేదు. ప్రతిసారీ అధిష్ఠానం ఆదేశాలను గౌరవించి వెనక్కి తగ్గిన ఆమె.. ఈసారి మాత్రం ఎలాగైనా తనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, కనీసం జిల్లా స్థాయి పెద్ద పదవినైనా కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. అందుతున్న లీకుల ప్రకారం, అనంతపురం జడ్పీ చైర్మన్ పీఠాన్ని తనకు ఇస్తే జెడ్‌పీటీసీ సభ్యురాలిగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు అధిష్ఠానానికి సంకేతాలు పంపారు.

ప్రభుత్వం తాజాగా విడుదల చేయనున్న రిజర్వేషన్ల లెక్కల ప్రకారం అనంతపురం జడ్పీ పీఠం జనరల్ కేటగిరీకి దక్కే అవకాశాలు ఉండటంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ పీఠంపై పరిటాల రవి వారసుడు, యువ నేత పరిటాల శ్రీరామ్ పేరు గట్టిగా ప్రచారంలో ఉంది. 2019 లో ఓడిపోయి, 2024 లో త్యాగం చేసిన శ్రీరామ్‌కు జడ్పీ ఇవ్వాలనే డిమాండ్ ఒకవైపు ఉండగా.. ఇప్పుడు సీనియర్ మహిళా నేతగా ఉన్న గంగుల భానుమతి కూడా అదే సీటును ఆశిస్తుండటంతో అనంతపురం టీడీపీలో అంతర్గత పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నాళ్లుగానో పార్టీని నమ్ముకుని ఉన్న భానుమతికి న్యాయం చేయాలా, లేక జిల్లాపై పట్టున్న పరిటాల కుటుంబానికి ఈ పదవి ఇవ్వాలా అనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.