రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యానికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ మద్దతు విషయంలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో.. వాషింగ్టన్ నుండి అందుతున్న సైనిక, సాంకేతిక సహాయంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు ఆపాలని, శాంతి చర్చలకు రావాలని ట్రంప్ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెస్తున్న తరుణంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ పొలిటికల్ ఒత్తిడి మధ్యే ఉక్రెయిన్ సైన్యం యుద్ధరంగంలో వాడుతున్న ఎలోన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడినట్లు నివేదికలు వస్తున్నాయి. డ్రోన్ల నియంత్రణకు, కమ్యూనికేషన్లకు స్టార్లింక్పైనే ఆధారపడ్డ ఉక్రెయిన్ దళాలకు ఈ నెట్వర్క్ స్పీడ్, వినియోగ పరిమితులు తగ్గడం పెద్ద భద్రతా ముప్పుగా మారింది. దీనిపై స్పందించిన ఎలోన్ మస్క్, మిలిటరీ గ్రేడ్ శాటిలైట్ వ్యవస్థ అయిన ‘స్టార్‌షీల్డ్’ నియంత్రణ పూర్తిగా అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేస్తూ బాధ్యతను వైట్ హౌస్ పైకి నెట్టేశారు.
మరోవైపు, రష్యా ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులపై అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు ముందస్తు నిఘా సమాచారం అందడం లేదని ఈ నెల అక్టోబర్ 13న జెలెన్స్కీ బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. నిఘా సమాచారాన్ని అమెరికా పూర్తిగా నిలిపివేయలేదని చెప్తున్నప్పటికీ, క్షిపణి హెచ్చరికలు అందకపోవడం మరియు స్టార్‌లింక్ పరిమితులు విధించడం చూస్తుంటే.. అమెరికా తన మాట వినేలా ఉక్రెయిన్ను లొంగదీసుకోవడానికి ఈ రక్షణ సహాయాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.














