విజయవాడ జనసేనకిస్తే.. టిడిపి ఆత్మని కోల్పోయినట్టే..!

0
6

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు మీద, కూటమి పార్టీలో సీట్ల సర్దుబాటు మీద తెలుగుదేశం, జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. రోస్టర్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేశామని, ఇందులో మా జోక్యం ఏమీ ఉండదని నేతలు చెప్తున్న మాటలని క్యాడర్, నాయకులు నమ్మడం లేదు. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చెయ్యాలన్న ఉద్దేశంలో అధినాయకులు లేరని, అందుకే రోస్టర్ మాటున దాక్కున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జగన్మోహనరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తను అనుకున్న వాళ్ల కోసం రిజర్వేషన్లని కావాల్సిన విధంగా మార్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

స్థానిక నాయకత్వం బలంగా ఉంటేనే పార్టీకి భవిష్యత్తు వుంటుందన్న విషయాన్ని మర్చిపోతున్నారని ఆక్షేపిస్తున్నారు. కూటమిలో మూడు పార్టీలున్నప్పటికీ, ప్రధానంగా తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మొదట తెలుగుదేశం నేత లోకేష్ 15, 5, 80 శాతం రేషియోలో పోటీ చేస్తామని చెప్పారని మీడియాలో వార్తలొచ్చినప్పుడు జనసేన నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ కూడా దీనిమీద అసహనం వ్యక్తం చేశారన్న వార్తలొచ్చాయి.

ఇప్పుడు 87 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా 19 మునిసిపాలిటీలకు తరువాత నిర్వహిస్తారు. 17 కార్పొరేషన్లలో 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా నాలుగు కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్లకి ఎన్నికలు జరగడం లేదు. రెండు రోజులుగా జనసేన, టిడిపి నేతల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడ, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం కార్పొరేషన్లలో జనసేన పోటీ చేసే అవకాశం వుంది.

రాజమండ్రి కార్పొరేషన్ బిజెపి అడుగుతోంది. ఇంకా కన్ఫామ్ కాలేదంటున్నారు. జనసేనకి తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో మెజారిటీ మునిసిపాలిటీలు ఇస్తారన్న వార్తలు వస్తున్నాయి. తూర్పుగోదావరిలో పది మునిసిపాలిటీలుంటే జనసేన 6 స్థానాల్లో, తెలుగుదేశం 4 స్థానాల్లో పోటీ చెయ్యొచ్చన్న వార్తలొస్తున్నాయి. ఈ జిల్లాలో వున్న రెండు కార్పొరేషన్లు ఒకటి కాకినాడ జనసేన, రాజమండ్రి బిజెపికిస్తే ఇక్కడ తెలుగుదేశానికి కేవలం 4 స్థానాలే మిగులుతాయి. పశ్చిమలో ఏలూరు కార్పొరేషన్ జనసేన, 7 మునిసిపాలిటీల్లో 5 జనసేన కిస్తే టిడిపికి మిగిలేది రెండు మునిసిపాలిటీలు.

ఈ రెండు జిల్లాల్లో జనసేనకు బలముంది కాబట్టి ఇస్తున్నారనుకుంటే, గుంటూరు జిల్లాలో కూడా చెరిసగం మునిసిపాలిటీలు ఖరారైనట్టు వార్తలొచ్చాయి. మొత్తం 11లో 5 జనసేన, 5 టిడిపి, 1 బిజెపి అంటున్నారు. గుంటూరు తరువాత పెద్ద పట్టణాలైన నరసరావుపేట, తెనాలి తో పాటు పొన్నూరు, రేపల్లె, సత్తెనపల్లి కూడా జనసేన ఖాతాలోనే అంటున్నారు. తెనాలి మినహా మిగతా అన్ని చోట్ల టిడిపి ఎమ్మెల్యేలే వున్నారు. కార్పొరేషన్ల విషయానికొస్తే, మిగతా చోట్ల పెద్దగా అభ్యంతరాల్లేవు కానీ విజయవాడ విషయంలో టిడిపి స్థానిక నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఆపార్టీకి కృష్ణా జిల్లాతో, విజయవాడ నగరంతో అవినాభావ సంబంధం వుంది. ఎన్టీఆర్ స్వస్థలం ఇక్కడే ఉండటం కూడా ఒక కారణం. విజయవాడ కార్పొరేషన్ జనసేనకిస్తే టిడిపి ఆత్మని కోల్పోయినట్టే అని కార్యకర్తలు మథనపడుతున్నారు. వంగవీటి రాధాకి మేయర్ పదవి ఇవ్వాలనుకుంటే అది టిడిపినే ఇవ్వొచ్చు కదా, జనసేనలోకి పంపించి ఆ పార్టీ నుంచి మేయర్ నిచెయ్యడం ఏంటని ప్రశ్నిస్తున్నారు? రేప్పొద్దున జనసేన విజయవాడ లోక్ సభ సీటు కూడా అడిగితే ఇచ్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

అసలు పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఫ్రెండ్లీ ఫైట్ కి వెళితే ఎవరి ఓట్ బ్యాంక్ ఎంతో తేలిపోతుంది. ఇవేమీ అసెంబ్లీ ఎన్నికలు కాదు కాబట్టి ప్రమాదం వుండదు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత ఓట్ పర్సంటేజి వస్తే రేపు అసెంబ్లీఎన్నికల్లో అదే రేషియోలో సీట్లు పంచుకోవచ్చంటున్నారు. ఇదొక రకంగా మంచి ఐడియా కూడా. ఎందుకంటే కూటమి ఏర్పడ్డాక కూడా నాయకులు కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ చాలా చోట్ల క్యాడర్ కలవలేదు. సోషల్మీడియాలో నిరంతరం యుద్ధం జరుగుతా వుంది. మా వల్లే గెలిచారని జనసేన అభిమానులు స్టేట్మెంట్లు ఇవ్వడం, టిడిపి అభిమానులు దానికి కౌంటర్ గా 2019 ఎన్నికలని ఉదహరించడం తరచుగా జరుగుతోంది. ఒకసారి విడివిడిగా చేస్తే వచ్చిన పర్సెంటేజిలని చూపిస్తున్నారు. అవి ఏడేళ్ల నాటి లెక్కలుకాబట్టి, తాజాగా మళ్లీ ఒకసారి లెక్కలు సరిచూసుకుంటే ప్రభుత్వానికి వచ్చే ప్రమాదమేమీ ఉండదు. ఎవరి బలం ఎంతో తెలుస్తుంది. దాన్ని బట్టి 29 ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.