రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి తమిళనాడు పేసర్..!

0
5

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్ వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఒక భారీ ప్లేయర్ ట్రేడింగ్ ఒప్పందం కుదిరింది. ఆరెంజ్ ఆర్మీ తమ పాత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, తమిళనాడు పేసర్ టి. నటరాజన్‌ను ట్రేడింగ్ పద్ధతిలో మళ్లీ సొంత గూటికి తెచ్చుకుంది. ఈ డీల్‌లో భాగంగా నటరాజన్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీని రూ. 40 లక్షల బదిలీ ఫీజుతో దక్కించుకుంది.

ఈ సంచలన రీ-ఎంట్రీ కోసం నటరాజన్ ఏకంగా రూ. 5.75 కోట్ల భారీ జీతం కోతకు అంగీకరించడం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నటరాజన్‌ను రూ. 10.75 కోట్ల భారీ ధరతో కొనుగోలు చేసింది. అయితే ఢిల్లీ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు గాయాల బారిన పడటంతో, ఇప్పుడు తిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించేందుకు కేవలం రూ. 5 కోట్ల సవరించిన ధరకే నటరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

గతంలో 2020 నుండి 2024 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నటరాజన్ అత్యంత కీలకమైన బౌలర్‌గా రాణించాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2024 సీజన్‌లో 19 వికెట్లు తీసి ఎస్ఆర్‌హెచ్ తరఫున టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. గత సీజన్‌లో హైదరాబాద్ జట్టులో హర్షల్ పటేల్ బౌలింగ్ పూర్తిగా ఫ్లాప్ అవ్వడంతో, డెత్ ఓవర్ల సమస్యను పరిష్కరించడానికి, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని పేస్ విభాగానికి మరింత బలాన్ని చేకూర్చడానికి నటరాజన్ అనుభవం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పిచ్‌పై బాగా ఉపయోగపడుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.