బెజవాడ టీడీపీలో పాపం ఆ ఇద్దరూ.. తమ్ముళ్ల ఆవేదన..!

0
6

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటు చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా నమ్ముకున్న సీనియర్ నేతల త్యాగాలను మరోసారి తెరపైకి తెచ్చింది. పొత్తులో భాగంగా ఈ ప్రతిష్టాత్మకమైన మేయర్ పీఠాన్ని జనసేన పార్టీకి కేటాయించబోతున్నారనే వార్తలు వస్తున్న వేళ, నగర టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి సైనికుల్లా పనిచేస్తున్న చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు లాంటి సీనియర్ల పట్ల అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక కార్యకర్తలు సానుభూతితో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా పార్టీ జెండాను వీడని సచ్ఛీలమైన నాయకులు చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు. విజయవాడ నగరంలో పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడంలో వీరి పాత్ర ఎంతో కీలకం. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా వీరిద్దరిలో ఒకరికి మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి అధిష్ఠానం గౌరవిస్తుందని కార్యకర్తలు గట్టిగా ఆశించారు. కానీ, అనూహ్యంగా ఈ సీటు జనసేన ఖాతాలోకి వెళ్తుందనే ప్రచారం జరగడం, పైగా ఇటీవల పార్టీలోకి వచ్చిన వంగవీటి రాధా పేరు తెరపైకి రావడం దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నేతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

విజయవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు తమ్ముళ్లు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబశివరావుల తర్వాత టీడీపీలోకి వచ్చిన ఎంతోమంది నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, మేయర్లుగా పదవులు అనుభవించి చక్రం తిప్పారు. కొందరు పార్టీలు మారిపోయినా, మరికొందరు కొత్తగా వచ్చినా వారికే పదవుల దక్కాయి తప్ప.. జెండా మోసిన ఈ ఇద్దరు సీనియర్లు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయారనే ఆవేదన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఎన్డీయే కూటమి బలోపేతం కోసం చంద్రబాబు చేస్తున్న ఈ వ్యూహాత్మక సర్దుబాట్లు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న పాత తరం నాయకులకు మళ్లీ అన్యాయం చేసేలా ఉన్నాయనే చర్చ బెజవాడ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.