రెచ్చిపోతే ఎమ్మెల్యేలను వదిలిపెట్టను: చంద్రబాబు..!

0
8

ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూపరిపాలన, రాజధాని అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అత్యంత సంక్లిష్టమైన భూముల సమస్యను తమ కూటమి ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించిందని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సుమారు 60 వేల మంది లబ్ధిదారులకు రూ.2 వేల కోట్ల విలువైన భూములను పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు వెల్లడించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివాదాస్పద ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ను తీసుకువచ్చి భూయజమానుల హక్కులతో ఫుట్‌బాల్ ఆడుకుందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జరిగిన ఆ భూ అరాచకాలను అణచివేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం అధికారిక పాస్‌బుక్‌లపై గౌరవప్రదంగా ‘రాజముద్ర’ వేసి మరీ రైతులకు, భూయజమానులకు పంపిణీ చేస్తోందని సగర్వంగా ప్రకటించారు. ఇదే వేదికపై రాజధాని అమరావతి ప్రస్తావన తెస్తూ.. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో అమరావతిలో ‘ల్యాండ్ పూలింగ్’ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

తమపై ఉంచిన నమ్మకంతోనే రాజధాని నిర్మాణానికి రైతులు వేలాది ఎకరాల భూములను త్యాగం చేశారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని భరోసా ఇచ్చారు. అలాగే భారతీయ సంస్కృతిలో నదులకు అత్యున్నత స్థానం ఉందని, అందుకే తాను నదుల వద్ద భక్తిశ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జీవనాడులైన కృష్ణా, గోదావరి నదుల పుష్కరాలను 3వ సారి అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించబోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కూటమికి 164 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, రాష్ట్రానికి భారీ విజయాన్ని ప్రజలు అందించారని, ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే నిర్మొహమాటంగా చెప్తున్నా.. కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.