ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఘర్షణలు జరుగుతున్నాయంటూ, ఏకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింస, ఏకగ్రీవాల కోసం సాగిన అరాచకాలను విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆనాడు అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల నామినేషన్లను బలవంతంగా అడ్డుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని, మరి అన్ని అరాచకాలు జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా జగన్ ఎందుకు రాజీనామా చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నాడు 2020-21 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నామినేషన్ల పర్వంలోనే 57 ప్రధాన ఘర్షణలు జరిగాయని (43 జెడ్‌పీటీసీ/ఎంపీటీసీ స్థానాల్లో, 14 మున్సిపాలిటీల్లో), పోలింగ్ రోజున 33 తీవ్రస్థాయి హింసాత్మక కేసులు నమోదయ్యాయని నాటి డీజీపీ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద 1,370 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోనే 22 తీవ్రమైన కేసులు, 581 మంది నిందితులుగా ఉండగా, తాడిపత్రిలో 7 కేసుల్లో 728 మందిపై కేసులు నమోదయ్యాయి. ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరించడం, నామినేషన్ పత్రాలను చించివేయడం వంటి ఘటనలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.
2021 ఫిబ్రవరి 6వ తేదీన నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, నాడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏకంగా ఆయన ఇంట్లోనే గృహనిర్బంధం చేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఒక అధికార పార్టీ మంత్రిపైనే ఎస్‌ఈసీ అప్పట్లో అలాంటి చర్య తీసుకోవడం నాటి ఎన్నికల దుస్థితికి అద్దం పడుతోంది. నాడు 2021లో స్వయంగా తానే ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్రవ్యాప్తంగా అధికార బలంతో వందలాది ఏకగ్రీవాలు చేసుకుని, ప్రతిపక్షాల నామినేషన్లను తుంగలో తొక్కినప్పుడు జగన్‌కు రాజ్యాంగ సంక్షోభం గానీ, ప్రజాస్వామ్య విలువలు గానీ గుర్తుకు రాలేదని విశ్లేషకులు ఎండగడుతున్నారు.
అప్పట్లో అంతటి హింస సాగినా నైతిక బాధ్యత వహించి సీఎంగా రాజీనామా చేయని జగన్, నేడు కూటమి ప్రభుత్వం చట్టప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుంటే ఓటమి భయంతో రాష్ట్రపతి పాలన కావాలంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇదంతా మద్యం కుంభకోణం వంటి ఇతర కీలక అంశాల నుండి ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని, శాంతిభద్రతల సమస్య నెపంతో సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోంది.














